రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోందన్నారు. మళ్లీ వైరస్ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. కరోనా చికిత్సలో వాడుతున్న అన్ని మందులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమేనని మంత్రి అన్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే రెండుసార్లు నిర్వహించినట్లు తెలిపారు. బ్లాక్, వైట్ ఫంగస్‌కు సంబంధించి మందులు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. 85 శాతం టీకాల ఉత్పత్తిని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుందని దీంతో టీకాల విషయంలో రాష్ట్రాల పాత్ర లేకుండా పోయిందన్నారు. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ హైదరాబాద్‌లోనే తయారవుతున్న ఇక్కడి ప్రజలకు వ్యాక్సినేషన్ అందించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్షా 22 వేల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ @KTRTRS pic.twitter.com/7NYkVFB9OO
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 28, 2021