రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 21 : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి అనంతరం కలెక్టట్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 54 వేల రెండు వందల మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఒకపక్క బిల్లులు సకాలంలో రాక వంట కార్మికులు అప్పులు చేసి పథకాన్ని నిర్వహిస్తూ అనేక ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పథకం సక్రమంగా నడవలేక పోవడానికి కారణం కార్మికులే అని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రూ.10,000 వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు నడిగొట్టు లక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు.