కోనరావుపేట, మార్చి : ప్రజా పాలనలో మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు నీటికి(Water) రోజుల తరబడి వేచిచూసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నల్లా నీరు రాక, మిషన్ భగీరథ నీరు సరఫరా కాక గామస్తులు తల్లడిల్లుతున్నారు. స్థానికంగా ఉన్న బోర్లు నిర్వీర్యమవ్వడంతో గత్యంతరం లేక వ్యవసాయ మోటర్ల వద్ద నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. నల్లా నీరు వస్తలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్తే గ్రామపంచాయతీలో డబ్బులు లేవంటూ నిర్లక్ష్యపు సమాధానం చెపుతున్నారు. ఈ దుస్థితి కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలోని 1,10వ వార్డులలో చోటు చేసుకుంది.
నీటిగోస తీర్చేవారే లేరా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని నల్ల బావిలో మంచినీరు ఉన్న 1,10వ వార్డులలో నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్య గత నెల రోజుల క్రితం తలెత్తగా అధికారులు ఇటువైపు రావడం లేదని మహిళలు చెపుతున్నారు. ప్రధానంగా బావి నుండి వచ్చే పైపులైన్‌కు గేటు వాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. అంతేకాకుండా మిషన్ భగరథ ద్వారా నీరు అందించాలని కోరగా ఒక రోజు మాత్రమే నీటిని అందించి చేతులు దులుపుకున్నారన్నారు.
మిషన్ భగీరథ నీరు రోజు అందించాలని వేడుకున్న మోటర్లు సరిగా లేవని అధికారులు చెపుతున్నారని వాపోయారు. కాగా, వార్డులో తాగునీరు లేక నెల రోజులుగా ఇబ్బందిపడుతున్నాం. వ్యవసాయ బోరుబావు లకు వెళ్లి పొలం గట్లపై పడుతూ లేస్తూ నానా అవస్థలు పడుతున్నాం. వ్యవసాయ బోరుబావులు సైతం వట్టి పోతుండడంతో దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుందని గెంటే ఎల్లవ్వ అన్నారు. అధికారులు చెపితే గ్రామపంచాయతీలో పైసలు లేవని చెపుతున్నారు మాకు నీటి సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.