సిరిసిల్ల, మే 4 : బీజేపీ కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు, పలువురు కార్యకర్తలు కేటీఆర్(KTR) సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. సోమవారం తెలంగాణ భవన్లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్ల ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో వీరిని కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
కేసీఆర్ సీఎం కాక ముందు.. కేసీఆర్ సీఎం అయ్యాక భూముల ధరలు ఎలా ఉన్నాయి? మరి.. కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించిన కేటీఆర్.. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాన్ని కడిగిపారేశారు. ‘కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు10వ వార్డులో ధర ఎంత ఉండే?
కేసీఆర్ సీఎం అయ్యాక ఎంత అయిందో మీకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక భూముల ధరలు ఎంత ఉన్నాయో మీరు చూస్తున్నారు.
కాంగ్రెస్ బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయలేదు. 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలను 30 నెలలు అవుతున్నా అమలు చేయలేదు. తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన నిన్ను ఇప్పుడు ఏమనాలి రేవంత్ రెడ్డి?’ అని కేటీఆర్ నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మిడ్ మానేరు రిజర్వాయర్, మల్కాపేట రిజర్వాయర్‌లో నీరు తెచ్చి ఇక్కడ భూగర్భ జలాలను పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పథకాలు సక్రమంగా అమలు చేశాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మోసపోతే గోసపడుతాం అని ఆనాడే కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ చెప్పినట్టే అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం మోసం చేసింది. అందరూ ఒక్కటే పని పెట్టుకున్నారు.. దోచుకో దాచుకో అన్నట్టు ఉంది ప్రస్తుతం.

రానున్న రోజుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలందరూ కంకణ బద్దలు కావాలి. నెలకు రెండున్నర వేలు ఇవ్వడం చేతగాని సీఎం.. కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట. ఇది నమ్మొచ్చా’ అని రేవంత్‌పై మండిపడిన కేటీఆర్ ఈ సందర్భంగా పోచమ్మ గుడికి సహాయం చేస్తానని, మల్కాపేట రిజర్వాయర్ నుండి నీటిని 10వ వార్డుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
