KTR Tea Stall | సిరిసిల్ల మార్చి 22: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ టీ స్టాల్ పేరుతో ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారి హోటల్లో కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కేటీఆర్ హోటల్ యజమాని బత్తుల శ్రీనివాస్‌కు భరోసానిస్తూ తన సొంత ఖర్చులతో హోటల్ ఏర్పాటు చేయించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ బతుకమ్మ ఘాట్ వద్ద గత నాలుగేళ్లుగా ‘కేటీఆర్ టీ స్టాల్’ నడిపిస్తున్నాడు. హోటల్ బోర్డుపై కూడా కేటీఆర్ ఫొటో పెట్టుకున్నారు. ఇది గమనించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గత నెలలో ఆ హోటల్‌ను మూసేయించారు. అసలు ఆ టీ స్టాల్‌కు ట్రేడ్ లైసెన్స్ ఉందా? లేకుంటే హోటల్‌ను సీజ్ చేయండి అంటూ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ హుకుంతో వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది టీ స్టాల్‌ను బలవంతంగా మూసివేయించారు. రెండు రోజుల తర్వాత హోటల్ యజమాని బత్తుల శ్రీనివాస్‌కు కనీస సమాచారం ఇవ్వకుండానే, హోటల్లోని సామాగ్రిని కూడా తీసుకొనివ్వకుండానే క్రేన్ సహకారంతో టీ స్టాల్ మున్సిపల్ అధికారులు సినారె కళామందిరానికి తరలించారు. మార్గమధ్యంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన బత్తుల శ్రీనివాసును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అడ్డుకోవడం, ఆందోళన చేయడం లాంటివి చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు శ్రీనివాస్‌ను హెచ్చరించారు.
విషయం తెలుసుకున్న కేటీఆర్.. బత్తుల శ్రీనివాస్‌కు అండగా నిలబడ్డారు. సిరిసిల్లలోని అతని నివాసానికి వెళ్లి భరోసా నిచ్చారు. తన సొంత ఖర్చులతో హోటల్ ఏర్పాటు చేయిస్తానని, అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో నూతన హంగులతో హోటల్‌ను ఏర్పాటు చేయించారు. ఆదివారం నాడు కేటీఆర్ తన చేతుల మీదుగా ఈ హోటల్‌ను ప్రారంభించనున్నారు.