సిరిసిల్ల రూరల్: బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికతో ఎట్టకేలకు ప్రభుత్వం అధికార యంత్రాంగం దిగి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు తీరాయి. తమకు మెటీరియల్స్, ఫ్యాకల్టీతోపాటు ఫ్యాకల్టీకి వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇటీవలే విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రోడ్డుతోపాటు కళాశాలలో కూడా ప్లకార్డులతో ఆందోళన చేశారు. కలెక్టర్, ఉన్నతాధికారులు రావాలి.. మా సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అయినప్పటికీ తహసిల్దార్ జయంత్, ఎస్ఐ ఉపేంద్ర చారి విద్యార్థులను శాంతింపజేసినా ఫలితం లేకుండా పోయింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నేత గజభీంకార్ రాజన్న ఆధ్వర్యంలో పార్టీ నేతలు కళాశాలకు తరలివెళ్లారు. అయితే విద్యార్థులను కలిసేందుకు వారిని అనుమతివ్వకపోవడంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు ఎండలో వేచి చూసి, 24 గంటల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేనట్లయితే తామే పరిష్కారం చూపిస్తామన్నారు. తామే విరాళాలు సేకరించి విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. తమ నాయకుడు కేటీఆర్‌కు చెప్పి మెటీరియల్ సమకూరుస్తామని హెచ్చరించారు.
దీంతో స్పందించిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం విద్యార్థులకు కావలిసిన మెటీరియల్ పంపించింది. నిర్వహణ కోసం కావలిసిన నిధుల చెక్‌ను రీజనల్ కోఆర్డినేటర్ వెంకన్న పంపించినట్లు ప్రిన్సిపాల్ జయ తెలిపారు. బీఆర్ఎస్ హెచ్చరికతో స్పందించడం స్వాగతిస్తున్నామని, తాత్కాలికంగా కాకుండా పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న పేర్కొన్నారు. విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.