వేములవాడ రూరల్, జులై 29 : సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికీ మూల వాగు ప్రవాహం ఊపందుకుంది. ఇప్పటికే మండలంలో లోటు వర్షపాతం ఉండడంతో వరి సాగు చేసే రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాకాలంలో వానలు కురుస్తాయని భావనతో ముందస్తుగా రైతులు వరి నాళ్లు సిద్ధం చేసుకున్నారు. కానీ ఎలినోవా ప్రభావంతో జూన్- జూలై మాసంలో కురవాల్సిన వర్షం కురువకపోవడంతో నాటు వేసేందుకు రైతులు వెనుకడుగు వేశారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వరి సాగు చేసే రైతులు ఇబ్బంది పడ్డారు.
మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి మల్లారం మూల వాగుతో పాటు పలు గ్రామాల్లోని చెరువులకు వర్షం నీరు చేరుతుంది. దీంతో రైతన్న వరిసాగు పై ఆశలు రేకెత్తాయి. వేములవాడ రూరల్ మండలంలోని మూల వాగు అనుకొని ఉన్న జయవరం మల్లారం హనుమాజీపేట లింగంపల్లి తో పాటు పలు గ్రామాల్లో వర్షపాతం ఎక్కువ ఉండడంతో పంటల సాగుపై అన్నదాతలో ఆసక్తి నెలకొంది. బుధవారం తో పాటు గురువారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో అన్నదాతలు ఆనందం నేలుకుంది. మూలవాగు ప్రవాహం మల్లారంతో పాటు జయవరం చేరుకోవడంతో వేములవాడ పట్టణానికి రాత్రి వరకు మూలవాగు ప్రవహించే అవకాశం ఉంది.