సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు (Urea) యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా అంటే రైతులకు వ్యథగా మారింది. ఉదయాన్నే సింగల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం మిగిలి వారంగనే, తిండి తిప్పలు లేకుండా అపసోపాలు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉంటూ అలసి సొలసి పోతున్నారు. తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో కేడీసీఎంఎస్ ఫర్టిలైజర్ దుకాణంలో 220 యూరియా బస్తాలు రాగా, సోమవారం ఉదయాన్నే అన్నదాతలు రైతు వేదికకు చేరుకున్నారు. క్యూలైన్లో పాసుబుక్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను ఉంచారు. వ్యవసాయ అధికారులు ఒక బస్తా టోకెన్ ఇవ్వడంతో, మళ్లీ పార్టీలైజర్ దుకాణానికి వెళ్లి డబ్బులు చెల్లించారు. అక్కడ డబ్బులు చెల్లించి గోదాముకు తరలి వెళ్లి యూరియా బస్తాలను తీసుకెళ్లారు.
ఒక్క బస్తా యూరియా కోసం మూడు చోట్ల పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటలకు వచ్చిన గంటల తరబడి క్యూ లైన్లో ఉండాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రభుత్వం, అధికారులు సరిపడా యూరియా అందివ్వలేకపోయారని, రైతులను గోసపెడుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 220 బస్తాలకు సుమారు 400 మందికిపైగా రైతులు రాగా, టోకెన్ దొరకని వారు నిరాశతో తిరిగి వెళ్లిపోయారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు ఒక్క యూరియా బస్తా ఏం సరిపోతుందని, వరి పొట్టకొచ్చిందని, యూరియా దొరకకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. రైతులకు యూరియాను పోలీస్ పహారులో పంపిణీ చేయడం గమనార్హం.