ఇల్లంతకుంట రూరల్, మార్చి05 : రంగనాయక సాగర్(Ranganayakasagr) నుంచి ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని పెద్దలింగాపూర్, రామోజీపేట, చిక్కుడువానిపల్లి, దాచారం, నర్సింహులపల్లి, చిన్నలింగాపూర్, ఎడ్లోనికుంట, బాలమల్లుపల్లి, అంకుసాపూర్, బస్వాపూర్, లక్ష్మీపూర్, తాడూర్ తదితర గ్రామాలకు సాగు నీళ్లు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఎల్ఎం6 కెనాల్ నిర్మాణం చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాల్వ పనులు బంద్ చేయడంతో రైతులకు ప్రస్తుత యాసంగి సీజన్ లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో కాల్వ పనులు చేపట్టాలని గత మూడు రోజులుగా రిలేనిరహారదీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చే వరకు రిలేనిరహారదీక్ష చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే కాల్వ పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.