Dairy Chilling Centre | వేములవాడ రూరల్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కేటీఆర్ ఫొటో ఉండటంతో.. చిరు వ్యాపారిపై అధికారులు తమ జులుం చూపించి.. ఓ టీస్టాల్‌ను మూసేయించిన ఘటన మరువక ముందే.. వేలాది మంది రైతు కుటుంబాలు ఆధారపడే డెయిరీ చిల్లింగ్ సెంటర్‌ను సీజ్చేసిన తీరు కక్ష పూరిత చర్యలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు.. సీజ్ చేయగా ఈ విషయాన్ని రైతులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. అంతేకాదు.. ఆందోళనకు సిద్దమవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అగ్రహారం వద్ద మిల్క్ చిల్లింగ్ కేంద్రాన్ని నడుపుతున్నారు. 2005 నుంచి ఈ చిల్లింగ్ కేంద్రం నడుస్తోంది. ప్రతీ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 145 గ్రామాల నుంచి పాలను సేకరించి ఇక్కడ చిల్లింగ్ చేస్తున్నారు. ఈ చిల్లింగ్ కేంద్రపై 18 నుంచి 20వేల మంది రైతులు అధారపడి ఉన్నారు. 2005లో స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ వేలం వేయగా.. కొనుగోలు చేసిన డెయిరీ.. ఇదే ఇండస్ట్రీలో చిల్లింగ్ కేంద్రాన్ని 2005 నుంచి నడుపుతోంది. అంతేకాదు.. చంద్రగిరి పంచాయతీకి వారు ఇచ్చిన నోటీసు మేరకు.. ప్రతి ఏడాది పన్ను చెల్లిస్తున్నారు.
సీజ్చేసిన అధికారులు..
గత 20 సంవత్సరాలుగా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చిల్లింగ్ కేంద్రం నడుస్తోంది. దీని ద్వారా దాదాపు 18 నుంచి 20వేల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిల్లింగ్ కేంద్రానికి ఇండస్ట్రియల్ అనుమతులు లేవని.. ఓ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు.. సీజ్చేస్తున్నట్లుగా మున్సిపల్, డీపీఓ, ఇండస్ట్రియల్ అధికారులు ప్రకటించారు.
గురువారం ఉదయమే చిల్లింగ్ కేంద్రం వద్దకు వచ్చిన అధికారులు సదరు డెయిరీ నిర్వహకులకు ఎటువంటి నోటీసులుగానీ, కనీస సమాచారం ఇవ్వకుండానే.. నేరుగా సీజ్‌చేసి వెళ్లిపోయారు. సీజ్‌చేసే సమయంలో.. చిల్లింగ్ కేంద్రంలో దాదాపు రూ.25 లక్షల విలువజేసే పాలున్నట్టుగా తెలుస్తోంది. ఆ పాలను తీసుకుంటామని సిబ్బంది చెప్పినా వినకుండా.. సీజ్ చేశారని సిబ్బంది పేర్కొంటున్నారు. నిజానికి ఈ విషయంలో అధికారులు కక్ష సాధింపు చర్యలను అనుసరిస్తున్నారు.
నోటీసు ఇవ్వకుండానే..
రెండు రోజుల క్రితమే.. నిబంధనలకు విరుద్ధంగా ఒక ఫీట్ గోడ ముందుకు వచ్చిందంటూ.. ప్రహారీ గోడను కూల్చివేసారు. ఈ సమయంలోనూ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. దీనిపై విమర్శలు వస్తుండగా.. చిల్లింగ్ కేంద్రం సీజ్ విషయంలో ఇదే విధానాన్ని అవలంభించారు. కనీసం ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే.. సీజ్ చేయడంపై సర్వాత్ర విమర్శలు వస్తున్నాయి.
ఇది అక్కడి అధికారుల కక్ష సాధింపుకు నిలువెత్తు నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. చిల్లింగ్ కేంద్రం సీజ్ చేసిన విషయంపై రైతులు భగ్గుమంటున్నారు. ఒక చిల్లింగ్ కేంద్రాన్ని మూసివేయాలంటే.. నోటీసు లాంటి నిబంధనలు పాటించాలని కనీసం ఎటువంటి నిబంధనలు పాటించకుండా.. ఎలా సీజ్ చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగానే అధికారుల తీరును నిరసిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని రైతులు భావిస్తున్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే !