సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 17: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి రోజూ కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వంటగదిలోని బియ్యం, కూరగాయలు, పండ్లు, కోడి గుడ్లు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ పరిశీలించి, స్వయంగా కలెక్టర్ ఆ నీటిని తాగి నాణ్యతను తనిఖీ చేశారు.
నాణ్యత ప్రమాణాలు మేరకే ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, కోడి గుడ్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. పబ్లిక్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివించాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రూసా ఫాతిమా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.