రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి 14 : వేసవి వడగాల్పుల(Heatwaves) నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వేసవి వడ గాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. మార్చి నుంచి జూలై వరకు ఆశా కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర అవసరమైన మేర ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు.
వడ గాల్పుల వల్ల వచ్చే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా దవాఖానలో ఫైర్ ఆడిట్ నిర్వహించాలలన్నారు. సమ్మర్ హీట్ వేవ్ నిర్వహణ కోసం జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి సమయాలను మార్చాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఎం.హెచ్.ఓ.రజిత, ఇన్చార్జి డిపిఓ శేషాద్రి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి వి.శ్రీధర్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.