సిరిసిల్ల టౌన్, మార్చి -24 : జిల్లాలో క్షయ (టీబీ) నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను ఉద్యోగుల అందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని, వారిని సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు.
టీబీ పేషెంట్ల పేషెంట్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం, మందులు ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. టీబీ రహిత గ్రామాలుగా శివంగాలపల్లె, అనంతపల్లి, రామన్నపేట, కంచర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ ఓ రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.