కలెక్టరేట్, జూలై 1: కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంటున్న ‘వి.బి.జి. రాంజీ’ చట్టాన్ని వెంటనే నిలిపివేసి, ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను యథాతథంగా కొనసాగించాలని సీఐటీయూ నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, రామంచ అశోక్, గురిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామీణ పేదల పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కొత్త విధానాలు ఉన్నాయని విమర్శించారు.
గతంలో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం అధిక భాగం నిధులు సమకూర్చేదని, ఇప్పుడు రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపడం వల్ల పథకం అమలు దెబ్బతింటుందని అన్నారు. వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేయడం చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కనీస వేతనాలపై స్పష్టత లేకపోవడం, పని ప్రదేశాల్లో ఉదయం, సాయంత్రం ఫొటోలు అప్లోడ్ చేయాల్సిన నిబంధనల వల్ల సాంకేతిక సమస్యలు ఏర్పడి కూలీలకు వేతనాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందన్నారు.
అలాగే గ్రామపంచాయతీల నిర్ణయాధికారాన్ని తగ్గించడం స్థానిక పాలనను బలహీనపరుస్తుందని, మెటీరియల్ అసిస్టెంట్లు, క్షేత్రస్థాయి సిబ్బంది ఉపాధి కూడా ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదల పని హక్కును కాపాడేందుకు కొత్త చట్టాన్ని అమలు చేయకుండా, ప్రస్తుత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్ దాస్, జిల్లా నాయకులు గీసా భిక్షపతి, సురేష్, రాజెల్లయ్య, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.