కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని బావు సాయిపేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కోతులు విద్యార్థులపై దాడి చేశాయి. ఐదవ తరగతి చదువుతున్న షేక్ రేష్మ అనే విద్యార్థిని పై కోతి దాడి చేసి గాయపరచడంతో వెంటనే సదరు విద్యార్థిని కోనరావుపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకుకెళ్లి వైద్యం చేయించారు. కాగా, గత కొద్ది నెలలుగా ప్రాథమిక పాఠశాల ఆవరణలో కోతులు దాదాపు 50కి పైగా ప్రతినిత్యం స్వైర విహారం చేయడంతో అటు విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కోతులను తరమడం పెద్ద పనిగా మారడంతో ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని, తరగతుల నిర్వహణ కూడా ఇబ్బందికరంగా మారిందని మధ్యాహ్న భోజన సమయంలో అది మరింత పెరిగిపోతుంది అని ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కోతుల దాడి భయంతో పాఠశాలకు పంపడానికి జంకుతున్నారు. పాఠశాల ఆవరణలో అంగన్వాడీ కేంద్రం ఉండడంతో ప్రతినిత్యం గర్భిణి మహిళలు, చిన్నారులు కేంద్రానికి వస్తుంటారు. వారికి కూడా కేంద్రం నిర్వహణ ఇబ్బందికరంగా మారిపోయింది. ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకోవాలని బాబు సాయి పేట గ్రామస్తులు కోరుతున్నారు.