ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 28: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడానికి ఎండలో విధులు నిర్వహించిన పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని బీఆర్ఎస్ నాయకులు భావించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పండ్లు, చల్లటి నీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తూ తమ ఉదారతను చాటుకున్నారు.
సభ విజయవంతానికి కృషిచేసిన పోలీస్ సిబ్బందికి బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ నాయకులు చేసిన మంచిపనిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దర్శనాల రామస్వామి, నలిమేటి చంద్రం, తదితరులు ఉన్నారు.