సిరిసిల్ల రూరల్, జూన్ 28: రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాతినిధ్యం వహించడం, ఇటు సిరిసిల్ల, అటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు, విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సిరిసిల్ల నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ మేరకు శనివారం తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, పార్టీ యూత్ నేత ఆఫ్రోజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాట్ల మధును ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌కు, ఆఫ్రోజ్ను తంగళ్లపల్లి పీఎస్‌కి తరలించారు. కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసినట్లు సమాచారం.
కాగా, ఇటీవలే కేటీఆర్‌పై గాంధీభవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయగా, గజ్జెల కాంతం వ్యాఖ్యలపై సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చచేశారు. ఆయన వ్యాఖ్యలను మాట్ల మధు, పార్టీలోని దళిత నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సైతం వరుస ప్రెస్మీట్లు పెట్టడంతో హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో నేడు సిరిసిల్లలో గజ్జెల కాంతం పర్యటన నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా బీఆర్ఎస్ నేతలని పోలీసుల ముందస్తు అరెస్టు చేయడం గమనార్హం. కాగా కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని, కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బద్నాం చేస్తున్నారని, కేటీఆర్‌పై వ్యాఖ్యలను ఖండించిన తమను అరెస్టు చేస్తున్నారని మాట్ల మధు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మాట్ల మధు అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు. ఆయనను పరామర్శించి, సంఘీభావం తెలిపారు. వీరిలో కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నండగిరి భాస్కర్ గౌడ్ , కట్ట రవి,బొడ్డు శ్రీధర్, అలువాల సాయిరాం తదితరులు ఉన్నారు.