ఎల్లారెడ్డిపేట మార్చి 24 : గొల్లపల్లిలో ఆవుల మేత గడ్డి కటింగ్ యంత్రంలో ఓ బాలుని చెయ్యి ఇరుక్కుని నుజ్జునుజ్జయిన ఘటన సోమవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన నిమ్మత్తుల మధుకర్ రెడ్డి- రజిత దంపతుల పెద్ద కుమారుడు సుదర్శన్ రెడ్డి (11) ఆదివారం కావడంతో తన తాత మల్లారెడ్డితో పాటు ఆవుల షెడ్డుకు వెళ్లాడు.
తాతతో పాటు ఆవుల దానకు పచ్చి గడ్డిని షార్ట్ కట్టర్ లో వేస్తుండగా పక్కనే ఉన్న బాలుడు సుదర్శన్ రెడ్డి కూడా వరిగడ్డిని వేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలుడి కుడి చేయి మిషన్లో ఇరుక్కుని గడ్డితోపాటు చుట్టుకుంది. దీంతో బాలుడు కేకలు వేయడంతో తాత మల్లారెడ్డి యంత్రాన్ని నిలిపివేశాడు. అప్పటికే కుడి చేతి మోచేతి కింది భాగం నుజ్జునుజు అయ్యింది. చికిత్స కోసం బాలుడిని మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.