సిరిసిల్ల రూరల్, జూలై 29: ఉత్తర తెలంగాణలో బీడీకార్మికుల కోసం 2012లో యూపీఏ సర్కార్ బీడీ కార్మిక దవాఖాన (Beedi Workers Hospital)ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2012 సెప్టెంబర్‌లో హాస్పిటల్‌కు అప్పటి కేంద్ర మంత్రి మల్లికార్జున ఖార్గే శంఖుస్థాపన చేశారు. తాత్కాళికంగా వేములవాడ మండలం నాంపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో హాస్పిటల్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. దవాఖాన నిర్మాణం కోసం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో 11.12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అక్కడ ప్రహరీ గోడ నిర్మాణం చేసి వదిలేశారు. నేటికి 13 ఏండ్లు కావస్తున్నప్పటికీ దవాఖాన నిర్మాణానికి మోక్షం లభించలేదు. పుష్కర కాలమైన బీడీ కార్మిక దవాఖాన ఏర్పాటును పట్టించుకోకపోవడంతో కలగానే మిగిలిపోయింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఈసారైన బీడీకార్మిక దవాఖానకు మోక్షం వస్తుందా.. ఏర్పాటు జరుగుతుందా అని కార్మికలోకం ఎదురు చూస్తున్నది. కరీంనగర్ ఎంపీగా రెండోసారి గెలిచిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పైనే ఆశలు పెట్టుకోగా, ఇక్కడకి మంజూరైన దవాఖానను కరీంనగర్‌కు తరలించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.
2012లో తాత్కాళికంగా..
కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో బీడీ కార్మిక దవాఖాన ఏర్పాటుకు 2012లో అప్పటి యుపిఎ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందుకు కోసం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో టెక్స్టైల్ పార్క్ అనుకొని ఉన్న 11.12ఎకరాల స్థలాన్ని సైతం కేటాయిం చింది. ఈస్థలంలో కేవలం కంపౌండ్ వాల్ నిర్మించారు. ఇక అంతటితో కార్మిక ఆసుపత్రి నిర్మాణం సాగడం లేదు. 2012 సెప్టెంబర్ 15న అప్పటి కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే, అప్పటి రాష్ట్ర మంత్రి శ్రీదర్రాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు వేములవాడ మండలం నాంపల్లి పరిధిలోని ఆర్ఆండ్ఆర్ కాలనీలో తాత్కాళికంగా బీడికార్మిక దవాఖానను ప్రారంభించారు. బద్దెనపల్లిలో బీడికార్మిక ఆసుపత్రి నిర్మాణంకు శంఖుస్థాపన చేశారు. తరువాత 100 పడకల దవాఖాన ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సిఫారుసు చేశారు. ఇందుకు రూ.50కోట్లు మంజూరు చేయాలని అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కోరగా, సానుకూలంగా స్పందించినప్పటికీ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభకాలేదు.
నాలుగు ఉమ్మడి జిల్లాల కార్మికుల కోసం
కరీంనగర్, మెదక్, నిజామామాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారు 5లక్షలకు పైగా బీడికార్మికులు ఉన్నారు. వీరికి వచ్చే వేతనాల్లో ఈఎస్ఐకు డబ్బులు కోత విధిస్తారు. మెరుగైన వైద్యం అందిచడానికి బీడీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వ ఈఎస్ఐ దవాఖానను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని అప్పటి యూపీఏ సర్కార్ ఆలోచించింది. 2012లో శ్రీకారం చుట్టింది. 50 పడకల దవాఖాన
నిర్మాణం కోసం రూ.50కోట్లు మంజూరు చేసింది. మొదట రూ.15కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. 2012 సెప్టెంబర్ 15న తాత్కాళికంగా దవాఖానను వేములవాడ మండలం నాంపల్లిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో దవాఖానను అప్పటి కేంద్రమంత్రి మల్లికార్జున్ ఖర్గే చేతులు మీదుగా ప్రారంభించారు. 13 ఏండ్లుగా ఇప్పటికి అలాగే తాత్కాళికంగా కొనసాగుతున్నది.
కరీంనగర్ కు తరలింపు..?
కరీంనగర్ పార్లమెంట్ పరిదిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 ఏండ్లుగా కలగా మిగిలిన బీడీ కార్మిక ఆసుపత్రి ఏర్పాటు స్థానిక ఎంపీ బండి సంజయ్ పైనే కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ఎంపీగా రెండోసారి గెలవడం.. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన దవాఖాన ఏర్పాటు చేసేలా, నిర్మాణం చేపట్టేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు. అయితే కార్మికులు ఆశలు వమ్ము చేసేలా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. దవాఖాన ను కరీం నగర్ కు తరలించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.
బద్దెనపల్లిలోనే దవాఖాన నిర్మించాలి..
13 ఏండ్లుగా కలగానే బీడీ కార్మిక ఆసుపత్రి మిగిలిందని బీఆర్ఎస్ కార్మిక విభాగం వెంగళ శ్రీనివాస్ అన్నారు. వెంటనే దవాఖాన నిర్మాణం చేపట్టాలి. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని బీడీ కార్మికులకు హాస్పిటల్ ఉపయోగపడుతుంది. బద్దెనపల్లిలో 11.25 స్థలం కేటాయించారు. ప్రహారి గోడ ఏర్పాటు చేసి వదిలేసిండ్రు. నాడు యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసినా, నిర్మాణం చేపట్టలేదు. అధికారం కోల్పోయింది. 2014 నుంచి కేంద్రంలో ఎన్ఎఎ సర్కార్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ సైతం ఆప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు 50 పడకల నుంచి 100 పడకల దవాఖాన ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ సైతం పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటికైనా కార్మికుల కల అయిన దవాఖానను ఏర్పాటు చేయాలన్నారు. హాస్పిటల్‌ను ఇక్కడ నుంచి తరలించవద్దని, బద్దెనపల్లిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.