నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి! నాకు ఎవరూ పోటీకాదు..2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నయి.. నేను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించను. నన్ను అన్నవాళ్లనే నేను అంటున్నా.. పదిన్నరేండ్లపాటు నేనే సీఎంగా ఉంటా’ అంటూ ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న మరునాడే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి బాంబు పేల్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఏకంగా ముఖ్యమంత్రినే అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి నాకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నా.. నాకు మంత్రి పదవి హామీ ఉన్నది’ అని రాజగోపాల్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజున తన మనోగతాన్ని మరోసారి బయటపెట్టారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు.
‘రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మంత్రి పదవి వస్తుంది.. మంత్రి కాకపోతే.. డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా.. ఇందులో భయపడేది ఏమీలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రిని చేస్తారా చేయండి. లేదంటే.. నా టార్గెట్ డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవే. మునుగోడును మీరు (కార్యకర్తలు) చూసుకోండి.. తెలంగాణను నేను చూసుకుంటా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు అడుక్కోవడం రాదు’ అంటూ హైకమాండ్‌కు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణ మీద జెండా ఎగరేసి చూపిస్తానని ప్రకటించారు.
ఇలా రాజగోపాల్‌రెడ్డి ప్రసం గం కొనసాగుతున్న సమయంలో ‘సీఎం.. సీఎం’ అంటూ కార్యకర్తలు కూడా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా.. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను క్లియర్ మెజారిటీతో గెలిపించుకున్నా మంత్రి పదవి ఇవ్వకుంటే ఎట్లా అనే ధోరణితోనే రాజగోపాల్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు.