హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : పల్లెల్లో ఉనికే లేని బీజేపీ ఇప్పుడు పట్టణాల్లోనూ గల్లంతైంది. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో కాస్త పట్టు ఉంటుందనే వాదనలను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయి. కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకున్నా, ఢిల్లీ నుంచి దండును దించినా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాకీ పెట్టి లేపే ప్రయత్నం చేసినా ఇవేవీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గట్టెక్కించలేకపోయాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీని కూడా సంపూర్ణ మెజారిటీతో బీజేపీ గెలవలేకపోయింది. రాష్ట్రంలో బీజేపీ నామ మాత్రపు పార్టీయే తప్ప ప్రధాన పార్టీ కాదనే విషయాన్ని ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. తెలంగాణలో భవిష్యత్ తమదేనంటూ రాష్ట్ర నేతలు చేస్తున్న వ్యాఖ్యలన్నీ గప్పాలేనని తేలిపోయాయి.
రాష్ట్రంలో 5 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. అయితే, ఒక్క మున్సిపాలిటీని కూడా సంపూర్ణ మెజారిటీతో గెలుచుకోలేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో కనీసం రెండు మున్సిపాలిటీలను దక్కించుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఆ మార్క్‌ను కూడా అందుకోలేపోయింది. వార్డుల్లోనూ ఓటమి పరంపర కొనసాగించింది. మొత్తం 2,582 వార్డులకుగాను 259 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు అతికష్టంపై గట్టెక్కారు. 45 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా గెలుచుకోలేక… ఖాతా తెరవలేదు.
మున్సిపల్ ఎన్నికల్లో పరువు నిలుపుకొనేందుకు బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరహాలో ప్రచారం చేసింది. ఢిల్లీ నుంచి పెద్ద దండునే దింపింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ నుంచి మొదలుకొని పలు బీజేపీ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. దీనికితోడు రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నా ఫలితం లేకుండా పోయింది. ఎంపీలైతే పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా మరీ ప్రచారం చేశారు. నితిన్ నబీన్ ఈ నెల 4న మహబూబ్‌నగర్‌లో ప్రచారం చేశారు. కానీ, అక్కడ భూత్పూర్లో 10 వార్డులకుగాను రెండు వార్డుల్లోనే విజయం సాధించింది. దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులకుగాను ఒకే ఒక వార్డులో విజయం సాధించింది.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయినప్పటికీ ఫలితంలేదు. ఈ జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో బీజేపీ ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోయింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో 30 వార్డులకుగాను 5 వార్డులతోనే సరిపెట్టుకున్నది. మహారాష్ట్ర మంత్రి ఆశీస్ షెల్లార్, ఎంపీ నవనీత్‌కౌర్ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధిష్ఠానం ప్రత్యేకంగా ఎన్నికల ఇన్చార్జీలను నియమించింది. ఆశీష్ షెల్లార్ను ఇన్చార్జిగా నియమించింది. ఆయనతో పాటు ఢిల్లీ సీఎం రేఖాశర్మ, అశోక్ పర్మామీను సహాయ ఇన్‌చార్జీలుగా నియమించింది. ఇంత చేసినా, ఫలితం శూన్యం. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రచారం చేసిన జిల్లాల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గాలివాటపు గెలుపుతో జబ్బలు చరుచుకున్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో వాస్తవం బోధపడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు ఎక్కువ గెలవడం యాదృచ్చికంగా జరిగిందే తప్ప, అదేదో స్టాండర్డ్ గెలుపు కాదనే అభిప్రాయాలున్నాయి. ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికలు, ఫలితాలు బీజేపీ అసలు సత్తాను బయటపెడుతున్నాయి.
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ను దెబ్బకొట్టడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నాయని, అనైతిక పొత్తు పెట్టుకున్నాయనే ఆరోపణలున్నాయి. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అనైతిక బంధంపై విమర్శలొచ్చాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బీజేపీని బలోపేతం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారనే విమర్శలున్నాయి. త్రిముఖ పోటీ అంటూ బీజేపీని సీన్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టి బీజేపీని లేపే ప్రయత్నం చేశారనే విమర్శలున్నాయి.
ఇందుకు పలు కార్పొరేషన్ల ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయనే చర్చ జరుగుతున్నది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఆఫర్ ఇచ్చినట్టు కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతున్నది. మెజారిటీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగా పరస్పర అంగీకారంతో అభ్యర్థులను నిలిపారనే విమర్శలున్నాయి. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నచోట ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఓట్లు చీల్చి బీఆర్ఎస్ను అడ్డుకున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.