రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 15: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 (ప్రిలిమ్స్, మెయిన్స్) ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి తెలిపారు. ఆగస్టు 24 నుంచి మే 2027 వరకు హైదరాబాద్లో కోచింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి అవకాశం కల్పించనున్నారని, అందులో 100 మందిని స్క్రీనింగ్ పరీక్ష ద్వారా, గతంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 50 మందికి నేరుగా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. దరఖాస్తులు జూలై 17 నుంచి ఆగస్టు 7 వరకు స్వీకరిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.5,000 స్టైపెండ్, రూ.5,000 పుస్తక నిధి, గ్రంథాలయ సౌకర్యం, నిపుణుల బోధన అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.