సిరిసిల్ల రూరల్, మార్చి 9: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి ఓ వ్యక్తి తన వ్యాన్‌ను తగులబెట్టాడు. ప్రమాదవశాత్తూ జరిగిందని అందర్నీ నమ్మించి.. బీమా డబ్బులు కొట్టేయాలని అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు గేటు సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్ వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు గేటు సమీపంలో ఈ నెల 8వ తేదీన రాత్రి ఐచర్ వ్యాన్ కాలిపోయింది. వ్యాన్‌లో మంటలు చెలరేగడంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. దీనిపై టెక్స్టైల్ పార్క్ గ్రామ కారోబార్ గౌడ రాజమహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వ్యాన్ ఓనర్ నిమ్మల మహేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిమ్మల మహేశ్ 9 నెలల క్రితం ఫైనాన్స్‌లో ఓ వ్యాన్‌ను కొనుగోలు చేశాడు. కానీ కొన్నప్పటి నుంచి వ్యాన్ తరచూ రిపేర్లకు వస్తుంది. అలాగే సరైన కిరాయిలు లేకపోవడంతో ఈఎంఐ డబ్బులు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు వ్యాన్‌ను ప్రమాదవశాత్తూ కాలిపోయిందని నమ్మిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. అందుకే పథకం ప్రకారం.. నిన్న రాత్రి ఓ క్యాన్‌లో పెట్రోల్ తీసుకొచ్చి, తన వ్యాన్ క్యాబిన్లో పోసి న్పిటించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని ఎస్సై రామ్మోహన్ వివరించారు.