వేములవాడ, అక్టోబర్ 25: వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిని జిల్లా మొత్తానికి విస్తరింపజేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా వీటీడీఏ పరిధిలో వేములవాడ అర్బన్ మండలంలోని 11గ్రామాలతోపాటు వేములవాడ పురపాలక సంఘం మాత్రమే ఉండేది. అయితే కొత్తగా సిరిసిల్ల మున్సిపాలిటీతో పాటు, వేములవాడ రూరల్, బోయినపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోని 152 రెవెన్యూ గ్రామాలను వీటీడీఏ పరిధిలోకి తీసుకువస్తూ జీవో నంబర్ 184 ఈ నెల 15న విడుదల చేసింది. హెచ్ఎండీఏ హైదరాబాద్ తరహాలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు వీటీడీఏ పరిధిని పెంచినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ పేరిట విడుదలైన వీటీడీఏ పరిధి విస్తరణ జీవో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నది.
వేములవాడ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోకి రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తాన్ని చేర్చడంపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పన్నుల భారం పడడంతోపాటు పలు రకాల అనుమతుల్లో అనేక ఆంక్షలు ఉంటాయని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్ హెచ్ఎండీఏ తరహాలో అభివృద్ధి చేసేందుకేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేరొన్నా, హైడ్రా పేరిట హైదరాబాద్లో నిర్మాణాలు కూల్చినట్టే ఇక్కడా కూల్చేందుకు పరిధి విస్తరణ చేశారని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పంచాయతీల్లో అనుమతులు కూడా వీటీడీఏ పరిధిలోకి రానుండగా, వాటి ప్రాధాన్యతను కూడా తగ్గించే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు.