ధాన్యం దళారులపాలవుతున్నదనడానికి ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లే నిదర్శనంగా నిలుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సీజన్‌కు రాగట్లపల్లి కొనుగోలు కేంద్రంలో ఐదు వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు జరిగేవి. ప్రస్తుత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించినా, ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో రైతులు నెలరోజులుగా కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.
అకాల వర్షాలతో కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇటీవల వడ్లు మొలకెత్తడంతో ఆందోళన చెంది, దళారులకు అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే క్వింటాల్‌కు 1,870 చొప్పున 9 లారీల ధాన్యం అమ్మేసుకున్నారు. ఇంకా నాలుగైదు లారీల వడ్లు మాత్రమే మిగిలాయని రైతులు చెబుతున్నారు. 500 బోనస్ వస్తుందని ఆశతో సన్నవడ్లను అమ్మకుండా ఉంచామని, అవి కొంటారో, కొనరో ఇంకా అర్థం కావడం లేదని వాపోతున్నారు.
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు అవస్థలు పడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి రోజులు గడుస్తున్నా కొనేదిక్కు లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఒక్క క్వింటాల్ కూడా కొనకపోవడంతో ‘ఎప్పుడు కొంటారా’ అని ఎదురుచూడాల్సి వస్తున్నది. ఓవైపు కొనుగోళ్లు ప్రారంభంకాకపోవడం, మరోవైపు అకాల వర్షాలు వెంటాడుతుండడంతో ఆందోళన కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ధాన్యం దళారుల పాలవుతుండగా, మద్దతు ధర దక్కకుండా పోతున్నది. కొన్నిచోట్ల తూకంలోనూ దోపిడీ చేస్తుండగా, రైతాంగం నిండా మునుగుతున్నది. త్వరగా కొనుగోళ్లు ప్రారంభించి, మద్దతు ధరతో కొనాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది.
కరీంనగర్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ)/తిమ్మాపూర్: వానకాలం సీజన్ ధాన్యం కొనేందుకు సివిల్ సప్లయ్స్ అధికారులు అక్టోబర్ నుంచే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. కరీంనగర్లో 340, జగిత్యాలలో 421, పెద్దపల్లిలో 311, సిరిసిల్లలో 258 చొప్పున ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,330 కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని.. గత నెల 10 తర్వాతి నుంచి కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు అన్ని కేంద్రాలను తెరిచినా ఎక్కడ కూడా క్వింటాల్ ధాన్యం కూడా కొనలేదు. నవంబర్ నెల వచ్చినా ఇప్పటి వరకు ఒక్క గింజ కొన్న పాపానపోలేదు.
ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయి కేంద్రాలకు ధాన్యం వస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వరి కోతలు చేసిన రైతులు కేంద్రాల్లో కుప్పలు పోసి ఎప్పుడు కొంటారోనని ఎదురు చూస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉందని సాకుతో రేపూ మా పంటూ జాప్యం చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు తుఫాన్ల కారణంగా అకాల వర్షాలు ఉన్నాయనే వార్తలతో భయపడిపోతున్నారు. ఇప్పటికే అక్కడక్కడా కురిసిన వర్షాలతో కేంద్రాల్లోని ధాన్యం తడుస్తున్నది. ప్రతి రోజూ కేంద్రాల వద్ద ధాన్యం ఆరబెట్టడం, కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పుకోవడం నిత్య కృత్యంగా మారింది. గత నెల మొదటి వారంలో వరి కోసిన రైతులు సుమారు నెల రోజులుగా ఇదే పని చేస్తున్నారు. మరింత ఆరితే తూకం తగ్గి తమకు నష్టం వస్తుందని వాపోతున్నారు.
ఒక్క కిలో కొనలేదు
కరీంనగర్ జిల్లాలో వానకాలం సీజన్లో మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు, అక్టోబర్‌లో 23 శాతంగా 91,894 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక నవంబర్‌లో 58 శాతంగా 2,34,029 మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 16 శాతంగా 63,826, వచ్చే ఏడాది జనవరిలో 3 శాతంగా 10,251 మెట్రిక్ టన్నులు కొనాలని నిర్దేశించుకున్నారు. అయితే అక్టోబర్ నెలలోనే కాదు, ఇప్పటి వరకు ఒక్క బస్తా ధాన్యం కూడా కొనలేదు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
దక్కని మద్దతు ధర
కొనుగోళ్లు ప్రారంభించకపోవడం, మరోవైపు అకా ల వర్షాల భయం వెంటాడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో దళారు లు, మిల్లర్లు, ఇతర వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఈ యేడాదికి ప్రకటించిన కనీ స మద్దతు ధర కూడా దక్కడం లేదు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు 2,320, సాధారణ రకానికి 2,300 కనీస మద్దతు ధర ఉంటే.. 1,800 మించి ధర పెట్టడం లేదు. అంటే రైతులు ఒక క్వింటాల్‌పై కనీసం 500పైనే నష్టపోవాల్సి వస్తున్నది. డబ్బు అవసరం ఉన్న రైతులు తేమశాతం తగ్గిన ధాన్యాన్ని కూడా అగ్గువకే అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.
తూకంలోనూ తేడా!
రైతుల దీన స్థితిని ఆసరా చేసుకుంటున్న దళారులు, ఇతర వ్యాపారులు ఇటు ధర తగ్గించడమే కాకుండా తూకంలోనూ మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పచ్చి వడ్లని రెండు మూడు కిలోలు, సంచి బరువని మరో కిలో తీస్తూ కాంటాలో కూడా దోపిడీకి తెర లేపారు. ఇటీవల తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక రైస్ మిల్లులో వేసిన తూకంలో క్వింటాల్‌కు రెండు కిలోలు తక్కువ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ మండలంలోని మొగిలిపాలెం, పర్లపల్లి, నల్లగొండ, పోలంపల్లి గ్రామాల్లో సగానికిపైగా కోతలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ గ్రామాలకు వెళ్లే దారుల్లో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. అయితే మిల్లులు అలాట్ కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఒక్క గింజ ధాన్యం కూడా కొన్నది లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అప్పగించక తప్పని నిస్సహాయతకు వస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుని ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు.
తూకంలో దోపిడీపై మీడియాకు సమాచారం ఇచ్చిన రైతులను కూడా దళారులు బెదిరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే 2014 కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు పునరావృతం అవుతున్నాయా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి, రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వశంగాక 70 క్వింటాళ్ల వడ్లను అమ్మిన
మాకు మూడెకరాల పొలం ఉన్నది. అందుల దొడ్డు వడ్లు, సన్నవడ్లు పెట్టినం. పెత్రమాస నాడు కల్లంలకు తెచ్చినం. నెల కింద గవుర్మెంటుకే అమ్ముకోవాలని సార్లు కేంద్రం చాలు చేసిన్రు. ఇప్పటి దాక ఇటు మొకాన సూసినోళ్లు లేరు. ఎప్పుడు మొగులైతదో ఎప్పుడు వానత్తదో అని భయ పడుతున్నం. నాల్గు సార్ల ఎండబోసి, వానచ్చిన ప్రతిసారి మల్ల, మల్ల నేర్పినం. వడ్లు ల్యాకలు రావట్టె. ఇగ వశంగాక, దిక్కులేక 70 క్వింటాళ్ల వడ్లను అమ్మేసిన. ఇంక సన్నపడ్లు ఈడనే ఉన్నయ్. అవన్న కొంటరో, కొనరో తెల్వది. సార్లు ఒకసారి ఇటు రండి. నెల రోజుల సంది ఎంత ఇబ్బంది పడుతున్నరో సూడున్రి.
-చేకూటి ఎల్లవ్వ, మహిళా రైతు, రాగట్లపల్లి (ఎల్లారెడ్డిపేట)
రైతులు ఆగమైతున్నరు.
నాకున్న మూడెకరాలల్ల వరి ఏసిన. 20 రోజుల కిందనే కోసి మా ఆవునూర్ కొనుగోలు కేంద్రంల పోసిన. అప్పటి సంది కొంటరని ఎదురుచూస్తున్న. మొదట మా ఊరిల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే సంతోష పడ్డం. కానీ, ఇప్పటి వరకు కొనెటోళ్లు లేరు. మబ్బులు పడ్డా.. వానలు పడ్డా భయమైతంది. ఏం జేయాలో తెలుస్తలేదు. ఇప్పటికే చానామంది రైతులు ఆగమైతున్నరు. వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్నరు. ప్రభుత్వం మా మీద దయచూపాలె. కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలె.
– వంగ రాజిరెడ్డి, ఆవునూర్ (ముస్తాబాద్)
ధాన్యం పోసి నెలయింది
నాకు ఐదెకరాలున్నది. మా నిజామాబాద్ కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెల అయితంది. నేను ధాన్యం పోసినంక పదిహేను రోజులకు సెంటర్ ప్రారంభించిన్రు. కలెక్టర్ సారు వచ్చి వడ్లు చూసి వెంటనే కొనాలని చెప్పిండు. ఎవరూ కొనలేదు. ప్రతి రోజూ ధాన్యం ఆరబెడుతున్నం. వర్షం వస్తదేమోనని భయంతో మళ్లీ కుప్పపోస్తున్నం. రోజంతా వడ్ల కాడనే ఉంటున్నం. అధికారులు గన్నీసంచులు కూడా వేసిన్రు. వడ్లు కొంటలేరు. అడిగితే మిల్లులు అలాట్మెంట్ కాలేదని చెబుతున్రు. ప్రభుత్వం వెంటవెంట వడ్లు కొనాలె. లేదంటే దళారులకు అమ్మడం తప్ప మరో గతి లేదు.
– ఈర్ల రాజు, నిజామాబాద్ (కోనరావుపేట)