Quality seeds | చిగురుమామిడి, జూన్ 23 : రైతులకు అందుబాటులో ఉండేందుకు వారి ముంగిట్లోకే నాణ్యమైన విత్తనాలను అందజేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మానకొండూరు వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీధర్, సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని సుందరగిరి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వేదికలలో విత్తనాల మేళా.. రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు’ కార్యక్రమాన్ని సర్పంచ్ జంగ శిరీష అధ్యక్షతన నిర్వహించారు.
అనంతరం వారు ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో మాట్లాడుతూ ఈనెల 23 నుండి 30 వరకు ప్రతీ రైతు వేదికలో రైతులకు ఖరీఫ్ సీజన్లో కావలసిన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ విత్తన మేళాలో సన్నవడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డిఏపీలు రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వ్యవసాయ పంటలపై సూచనలు సలహాలు కావాలంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగ శిరీష, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) రాకేష్, రైతులు పాల్గొన్నారు.