గాలె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత్.. శ్రీలంకతో తొలి టెస్టులో ఘన విజయానికి బాటలు వేసుకుంది. బ్యాటింగ్‌లో రిషబ్ పంత్ (69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66) మెరుపు అర్ధశతకానికి తోడు మానవ్ సుతార్ (2/30) తన స్పిన్ మ్యాజిక్‌ను కొనసాగిస్తుండటంతో గాలె టెస్టును సొంతం చేసుకోవడానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆతిథ్య లంక నాలుగో రోజు, మంగళవారం చివరకు 34 ఓవర్లలో 84/4తో ఓటమికి ఎదురీదుతోంది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (31 బ్యాటింగ్), సోనల్ దినుషా (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై చివరి రోజు భారత్ విజయానికి ఆరు వికెట్లు అవసరం కాగా.. లంక గెలవాలంటే మరో 288 పరుగులు చేయాలి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 48.5 ఓవర్లలో 190 రన్స్‌కు ఆలౌటైంది. పంత్‌తో పాటు పడిక్కల్ (44), కేఎల్ రాహుల్ (35) రాణించారు. లంక బౌలర్లలో అషిత ఫెర్నాడో 4, ప్రభాత్ 3 వికెట్లు తీశారు.
178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన భారత్‌కు తొలి ఓవర్లోనే లంక షాకిచ్చింది. జైస్వాల్ (0)మరోసారి నిరాశపరుస్తూ అసితా ఫెర్నాండో వేసిన మూడో బంతిని కీపర్ డిక్వెలాకు క్యాచ్ ఇచ్చాడు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ సె.ంచరీ హీరో పడిక్కల్, రాహుల్ నిలకడగా ఆడి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రభాత్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన రాహుల్.. అతడే వేసిన 15వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి మిడాన్‌లో రత్నాయకే చేతికి చిక్కడంతో 65 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఊపులో ప్రభాత్.. కెప్టెన్ గిల్ (8)నూ వికెట్ల ముందు బలిగొన్నాడు.
ఈ క్రమంలో పడిక్కల్‌కు పంత్ జతచేరడంతో స్కోరువేగం పెరిగింది. ఇద్దరూ ధాటిగా పరుగులు రాబట్టారు. లాహిరు కుమార ఓవర్లో పంత్.. బంతిని గ్రౌండ్ ఆవలకు పంపాడు. అయితే నువంతా.. పడిక్కల్‌ను ఎల్బీగా ఔట్ చేసి పర్యాటక జట్టును దెబ్బకొట్టడంతో భారత్ 116/4తో విరామానికి వెళ్లింది. లంచ్ తర్వాత కొద్దిసేపటికే ధ్రువ్ జురెల్ (7) నిష్క్రమించినా పంత్ దూకుడు తగ్గలేదు. నువాంత 36వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతడు.. లాహిరు బౌలింగ్‌లో సిక్స్‌తో టెస్టుల్లో 20వ అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. కానీ అతడే వేసిన 41వ ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా (9)తో పాటు లోయరార్డర్ ఆటగాళ్లు కూడా విఫలమవడంతో 200 మార్కు చేరకుండానే ఆలౌట్ అయింది.
భారీ లక్ష్య ఛేదనలో లంకకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. పిచ్ బౌన్స్, స్వింగ్‌కు సహకరిస్తుండటంతో భారత బౌలర్లు విజృంభించారు. మరోసారి ఆ జట్టు టాపార్డర్ నడ్డి విరిచారు. పేస్ లీడర్ సిరాజ్ వేసిన షార్ట్ పిచ్ బంతికి నిషాన్ మదుష్క (6) ప్రసిద్ధ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక, ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన దినేశ్ చందిమల్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన పసిందు సూరియబండార (0) సున్నా చుట్టాడు. స్పిన్నర్ సుతార్ తన రెండో బంతికే అతడిని ఎల్బీ చేశాడు. కాసేపటికే ప్రసిద్ధ్ షార్ట్ లెంగ్త్ బాల్‌కు కమిందు మెండిస్ (2) ఫస్ట్ స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ ధనంజయతో కలిసి క్రీజులో పాతుకుపోయిన లాహిరు ఉదార (16)ను సుతార్ నాలుగో వికెట్‌గా ఔట్ చేయడంతో లంక 47/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో దినుషాతో కలిసి పోరాడిన కెప్టెన్ ధనంజయ మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు.
100 టెస్టుల్లో పంత్ వంద సిక్సర్ల క్లబ్లో చేరాడు. స్టోక్స్ (138), మెకల్లమ్ (107) తర్వాత పంత్ (100) మూడో స్థానంలో ఉన్నాడు.
344 గాలెలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఛేదన. 2022లో పాకిస్థాన్.. లంక నిర్దేశించిన 344 టార్గెట్‌ను పూర్తిచేసింది.
2 టెస్టుల్లో 350+ టార్గెట్‌ను శ్రీలంక రెండుసార్లు మాత్రమే ఛేదించింది. 2017లో జింబాబ్వేపై (388), 2006లో దక్షిణాఫ్రికా (352)పై గెలిచింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్, శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్;
భారత్ రెండో ఇన్నింగ్స్: 48.5 ఓవర్లలో 193 ఆలౌట్ (పంత్ 66, పడిక్కల్ 44, అసితా 4/31, ప్రభాత్ 3/43)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 372): 34 ఓవర్లలో 84/4 (ధనంజయ 31 బ్యాటింగ్, దినుషా 25 బ్యాటింగ్)