హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో క్యూర్ పరిధిలో కొత్తగా 41 ‘2బీ’ బార్ల ఏర్పాటు.. మరోవైపు పబ్లిక్ స్కూళ్ల పేరిట సమీపంలోని పాఠశాలల విలీనం చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలను తన పోస్ట్‌కు ట్యాగ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సర్కార్ బడులను మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మరోవైపు విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. ఇది తుగ్లక్ పాలనా? ప్రజాపాలనా? అని నిలదీశారు. వెంటనే 41 బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటు, 105 టీఎపీఎస్ (తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల) పేరిట బడుల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.