హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటరుగా తన పేరు నమోదు చేసుకున్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఆయన దరఖాస్తు ఫారమ్ పూరించి సమర్పించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా సోమవారం వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ పరిధిలోని పట్టభద్రులంతా తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల ప్రకారం, గత ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా ప్రస్తుత ఎన్నికల కోసం మళ్లీ కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విసృ్తతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులందర్నీ గుర్తించి, నవంబర్ 6 నాటికి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా ప్రత్యేక చొరవ చూపి సహకరించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో విసృ్తత ప్రచారం చేయాలని సూచించారు.