Godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 6 : గని కార్మికుడు, అమరుడు పుట్ట నారాయణది ప్రభుత్వ హత్యేనని, అప్పటి పాలకులు ఆ కుటుంబం న్యాయం చేయకపోవడం దుర్మార్గపు చర్య అని పలువురు ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు. ఈమేరకు 1978లో గోదావరిఖనిలో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన పుట్ట నారాయణ 48వ వర్ధంతి సందర్భంగా పుట్ట చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదావరిఖని మార్కండేయ కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో వర్ధంతి వేడుకలను నిర్వహించారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాదన కుమారస్వామి, ప్రముఖ సాహితీ వేత్త ఏలేశ్వరం వెంకటేశంతోపాటు అభ్యుదయ, ప్రజా సంఘాల నాయకులు హాజరై నారాయణ చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1978లో హైదరాబాద్ లో రమీజాబీ ఘటనపై అప్పటి ప్రభుత్వ పాశవిక చర్యను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతున్న క్రమంలో జీడీకే-6వ గనిలో పని చేస్తూ విధులు ముగించుకొని పుట్ట నారాయణ ఇంటికి వస్తుండగా, గోదావరిఖని సింగరేణి సూపర్ బజార్ సమీపంలో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పులకు అన్యాయంగా నారాయణ బలయ్యాడని పేర్కొన్నారు. ఆకలితో ఇంటికి వస్తాడనుకున్న బిడ్డ రక్తపు మరకలతో విగత జీవుడిగా రావడం, ఆ కుటుంబం ఎంత తల్లడిల్లి ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
అతని సోదరుడు రాజన్న అప్పటి పాలకులు, సింగరేణి అధికారుల కాళ్లావేళ్లా పడి బతిమిలాడుకున్నా కుటుంబంకు న్యాయం చేయలేదన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అప్పుడే నారాయణ ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పలువురిని మెమెంటోలతో సత్కరించారు. పుట్ట రాజన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్ఐపీ జాతీయ నాయకులు జేవీ రాజు, రిటైర్డు ఎస్సై పోచయ్య, దుర్గం ప్రమీల నగేశ్, మాజీ సర్పంచ్ గోశిక చంద్రయ్య, సురేశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.