మంథని, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ అంటేనే మోసమని, ప్రజలను వంచించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మంథనిలోని రాజగృహలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి నట్టేట ముంచడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిపోయిందని, ఢిల్లీ నుంచి గల్లీ దాకా వారిది ఒకటే నైజమని ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు లెక్కలేనన్ని అబద్ధాలు ఆడిన సీఎం రేవంత్‌రెడ్డినే తలదన్నేలా మంథని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు వ్యవహరిస్తున్నారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘మన తాత ముత్తాతలకు సంబంధించిన సంపదను దోచుకెళ్తున్నారని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక రవాణాను పూర్తిగా అడ్డుకుంటామని’ ప్రజలకు దొంగ హామీ ఇచ్చిన శ్రీధర్‌బాబు, మరీ ఏడాది గడుస్తున్నా రవాణాను ఎందుకు ఆపలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చడం శ్రీధర్‌బాబుకే సాధ్యమని దుయ్యబట్టారు. నాడు ఇసుక పాలసీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల పాటు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు.
లారీలు బంద్ చేయించడం మాట పక్కన పెడితే 24 గంటలు నడుపుకోవడానికి అనుమతులు ఇవ్వడం చూస్తుంటే ఇందులో ఎంత అక్రమంగా సంపాదిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గోదావరి, మానేరు నదుల్లో ఇసుకను తరలించకుండా అడ్డుపడుతుంటే, మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు మాత్రం తన సొంత నియోజకవర్గంలో జోరుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఆపడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, మాచీడి రాజుగౌడ్, వెల్పుల గట్టయ్య, కాయితీ శ్రీనివాస్, పెగడ శ్రీనివాస్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.