మంథని, మే 26 : బీసీ, ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘బీసీలు మేలు కొలుపు యాత్ర’ సోమవారం రాత్రి మంథనికి చేరుకోగా, అందులో ఆయన పాల్గొన్నారు. స్థానిక మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చినప్పుడే ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్ వస్తే బీసీ వర్గాల్లో చిచ్చు పెట్టి ఒక్క తాటి మీదకు రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. దాని ఫలితమే 78 ఏళ్ల తర్వాత కూడా బీసీల మేలుకొలుపు కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుందన్నారు.
సంవిధాన్ బచావో అని రాజ్యాంగాన్ని చేతులో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంథని నియోజకవర్గ ప్రజలకు రాజ్యాంగం, ఓటు హక్కు తెలియక పోవడం వల్లే మూడు ఓట్లు ఉన్న కుటుంబానికి ఏళ్ల తరబడి రాజ్యాధికారాన్ని అప్పగిస్తూ బానిసల్లాగా బతుకుతున్నామని వాపోయారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మహనీయుల చరిత్ర తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఎంతో మంది మహనీయుల విగ్రహాలను మంథనిలో ఏర్పాటు చేశానన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి, జ్యోతిబాఫూలే ఆశీస్సులతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తానన్నారు. బీసీల కోసం పోరాడుతున్న జక్కని సంజయ్‌కుమార్‌ను అభినందించారు.
బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాల్లో కేవలం 15 శాతం మించి అవకాశాలు పొందలేదన్నారు. బీసీలను చైతన్యవంతులను చేసేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, బీసీలంతా స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలుపాలని కోరారు. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్‌ను పుట్ట మధూకర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు తగరం శంకర్‌లాల్, ఎగోలపు శంకర్‌గౌడ్, ఆకుల రాజబాబు, ఆరెపల్లి కుమార్, శ్రీనివాస్, కనకరాజు పాల్గొన్నారు.