మంథని, జనవరి 17: మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)పై నిర్లక్ష్యం ఎందుకని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటే ఎంసీహెచ్‌లో కనీసం గైనకాలజిస్టును కూడా నియమించలేక పోతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అంబులెన్సులపై తన ఫొటోలు పెట్టుకోవడం కాదని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అంటే.. ఎమర్జెన్సీ పాలనే కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. మంథనిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్) శుక్రవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా గైనకాలజిస్టు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుట్ట మధూకర్ మాట్లాడుతూ, అంబులెన్సులపై తన ఫొటో పెట్టించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దవాఖానల్లో నెలకొన్న సమస్యలను మాత్రం గాలికి వదిలేశారని విమర్శించారు. తెలంగాణలో ఎక్కడ సభలు జరిగినా సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి శ్రీధర్‌బాబు.. శ్రీధర్‌బాబును రేవంత్‌రెడ్డి పొగుడుకోవడమే సరిపోతున్నదని ఎద్దేవా చేశారు. మంథని ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిపించినా ప్రజలను ఓట్ల యంత్రాలుగానే చూడడమే తప్పా ఏనాడూ సేవ చేయాలనే ఆలోచన ఆయనకు లేదని విమర్శించారు.
ఎంసీహెచ్‌లో రెండు నెలలుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో నియోజకవర్గంలోని గర్భిణులు ఇబ్బందులు పడుతూ పెద్దపల్లి, గోదావరిఖనిలోని దవాఖానలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. తరచూ మంథనికి వచ్చే కలెక్టర్ కూడా దవాఖానపై ఎందుకు దృష్టిపెట్టడం లేదని, వైద్యులను ఎందుకు నియమించడం లేదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. కోట్లు వెచ్చించి మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను నిర్మించారన్నారు. తాను జడ్పీ చైర్మన్‌గా ఉన్న సమయంలో దవాఖానలోని గర్భిణులు, బాలింతల కోసం కూలర్లతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించానని గుర్తు చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎంసీహెచ్‌లో గైనకాలజిస్టును నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆరెపల్లి కుమార్, మాచిడి రాజుగౌడ్, గొబ్బూరి వంశీ, తదితరులు పాల్గొన్నారు.