పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా..? దానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నదా..? పాత రిజర్వేషన్లు కొనసాగిస్తారా? లేక కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అమలు చేస్తారా? బీసీ కులగణన తర్వాత నిర్వహిస్తారా..? లేక ఓటర్ల జాబితా ప్రకారం ఎలక్షన్లకు వెళ్తారా..? ఇటువంటి అనేక సందేహాల మధ్య సర్పంచ్ ఎన్నికలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న మాటలు.. ఫిబ్రవరి నుంచి మారుతూ వస్తున్న ఆదేశాలను నిశితంగా పరిశీలిస్తే అసలు సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతున్నది. అయితే, పల్లెల్లో రాజకీయ వేడిని అలాగే ఉంచడంతోపాటు పార్టీ శ్రేణులు అధికార పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూసేందుకు ఈ తరహా ప్రకటనలే అవసరం కాగా, ప్రభుత్వం ఈదిశగా అడుగులు వేస్తున్నదన్న అభిప్రాయాలు సొంత పార్టీ నుంచే వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇదంతా ఒక ప్రణాళికలో భాగమే అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, రిజర్వేషన్లకు సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం, ముసాయిదా జాబితా, తుది జాబితా అంటూ చేస్తున్న హడావుడి మాత్రం అంతా ఇంతా లేదు.
కరీంనగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వార్డులు, గ్రామపంచాయతీల వారీగా రూపొందించిన ఓటర్ ముసాయిదా జాబితాను సెప్టెంబర్ ఆరో తేదీన జీపీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ పార్థసారధి ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టు తయారీ, ప్రచురణ పురోగతిపై జిల్లా అధికారులతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించిన ఓటర్ల లిస్టుల ప్రకారం యధావిధిగా వార్డు, పంచాయతీ వారీగా జాబితాను తయారు చేయాలని సూచించారు. ఆ ముసాయిదా ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో అంటించిన తర్వాత మండల, జిల్లా స్థాయిల్లో వేర్వేరుగా రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని, వారి నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.
ముసాయిదా ఓటర్ జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే సెప్టెంబర్ 13వ తేదీ వరకు సంబంధిత మండల పరిషత్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులకు రాతపూర్వకంగా తెలుపాలని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ అధికారులు తగిన చర్యలు తీసుకొని సవరించిన తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 21వ తేదీన ప్రచురించాలని సూచించారు. అర్హులైన ఓటర్లు తమ పేర్లను గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలన్నా, ఓటర్ల తొలగింపు కోసం ఆక్షేపణలున్నా నిర్దేశించిన ఎన్నికల ఫారంను నింపి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ ఓటర్ల చేర్పు, తొలగింపు తర్వాతనే గ్రామపంచాయతీ ఓటరు లిస్టును పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
ఓటర్ లిస్టుల తయారీ తర్వాత వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, తదితర అంశాలపై అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులకు ఆయన వివరించారు. ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేసిన సర్క్యూలర్‌ను తూ.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఓటర్ లిస్టుల తయారీలో పురోగతి, ఎదురవుతున్న ఇబ్బందులపై కలెక్టర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు.
పంచాయతీ ఎన్నికలెప్పుడొచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్లోనే ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి ఒకటితో జీపీ పాలకవర్గాల గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు వెంటనే చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (లెటర్ నంబర్ 921/ టీఎస్ఇసీ-పీఆర్/ 2023) అన్ని జిల్లాల కలెక్టర్లను అప్పుడే ఆదేశించింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో.. వారికి తగ్గట్టుగా ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను నియమించాలో నిర్దేశించింది. పంచాయతీ ఎన్నికలను ఎన్నికలను 2019 జనవరిలో వివిధ దశల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం 2024 ఫిబ్రవరి ఒకటితో పాలకవర్గాల పదవీకాలం ముగియగా, రాజ్యాంగంలోని 243(3)(ఏ) ఆర్టికల్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం గత ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
అంతేకాదు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం పాలకవర్గ పదవీకాలం ముగియడానికి మూడు నెలల్లోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని చెప్పింది. అందుకోసం రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని నియమించడంతోపాటు శిక్షణ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 200 ఓటర్లు ఉన్న పోలింగ్‌స్టేషన్ పరిధిలో ఒక ప్రిసైడింగ్ అధికారి ఒక పోలింగ్ అధికారిని నియమించాలని సూచించింది. అలాగే 201 నుంచి 400 మంది ఓటర్లు ఉన్న కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు.. 401 నుంచి 650 వరకు ఓటర్ల ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించుకోవాలని ఆదేశించింది.
ప్రతి వార్డులో ఒక పోలింగ్ బూత్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, 650 దాటితే రెండు పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సిబ్బందితోపాటు ప్రిసైడింగ్ అధికారులతో జాబితా సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. నిశితంగా పరిశీలిస్తే.. అప్పటినుంచి ఇప్పటివరకు ఇలా ఆదేశాలు రావడమే తప్ప.. రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రం కొలిక్కిరావడం లేదు. అది వస్తే తప్ప వీటి ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి సర్పంచ్ ఎన్నికలు జరగాలంటే ముందుగా రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సిన అవసరముందంటున్నారు నిపుణులు. దానికి ముందుగా ప్రభుత్వం ఏ విధానంలో ఎన్నికలకు పోతుందన్న అంశాన్ని విప్పిచెప్పితే తప్ప అడుగు ముందుకు వేయలేమంటున్నారు అధికారులు. ప్రధానంగా బీసీ కుల గణన అయిన తర్వాత ఎన్నికలకు వెళ్తారా..? లేక ప్రస్తుతమున్న ఓటర్ జాబితా ఆధారంగా ఎన్నికలకు వెళ్తరా..? అన్నదానిపై స్పష్టత వస్తే తప్ప ఎలక్షన్లు నిర్వహించడం అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని తేల్చిచెప్పకుండా ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతున్నది. కులగణనకు కట్టుబడి ఉన్నామని ఇటీవల క్యాబినెట్లో తీర్మానం చేసి చెప్పింది.
ఈనేపథ్యంలో బీసీ కులగణన తర్వాతే ఎన్నికలు ఉంటాయని అందరూ భావిస్తున్న తరుణంలో రెండు రోజల క్రితం ముఖ్యమంత్రి మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో మరో రకంగా మాట్లాడారు. ఓటర్ జాబితా ఆధారంగా ఎన్నికలకు వెళ్తామన్నారు. ఇదే రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ కులగణన అధారంగా వెళ్తామని ప్రకటించారు. అంటే.. ఏవిషయంలోనూ ఎవరికీ స్పష్టత లేదని స్పష్టమవుతున్నది. 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సుప్రీం కోర్టు పలు ఆదేశాలు ఇచ్చింది. ఏ పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని స్పష్టం చేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను అప్పటి పంచాయతీ రాజ్ అధికారులు ఖరారు చేశారు. ఆ ప్రకారం చూస్తే బీసీలకు 22.79 శాతం, అలాగే ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. అయితే వివిధ రాష్ర్టాల్లో వివిధ పద్ధతుల్లో సర్పంచ్ ఎన్నికలు అప్పట్లో జరిపారు.
అంతేకాదు, చాలా రాష్ర్టాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చారు. దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం… బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ డెడికేటెడ్ కమిషన్ (మన రాష్ట్రంలో బీసీ కమిషన్) నియమించాలని సూచించింది. సదరు కమిషన్ పూర్తి అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలని చెబుతూనే.. ఏ పరిస్థితుల్లోనూ అన్ని కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని స్పష్టం చేసింది. అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే.. బీసీ రిజర్వేషన్లు తేల్చాల్సిన అవసరమున్నది. ఇవి తేలాలంటే బీసీ కులగణన అయినా జరగాలి? లేదా ఓటర్ల ప్రాతిపదికన విరాలు సేకరించి రిజర్వేషన్లు కల్పించాలి. అది కూడా 50 శాతం లోపే ఉండాలి.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఏ పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్నది స్పష్టం. కానీ, కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రస్తుతం సమస్యగా మారుతున్నది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్ల పెంచుతామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని స్పష్టంచేసింది. తద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడమే కాకుండా.. బీసీ వర్గాల్లో ఉపకులాల వారీగా వర్గీకరణ చేసి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని తన బీసీ డిక్లరేషన్‌లో స్పష్టం చేసింది.
ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దు. మరోవైపు బీసీ కులగణన జరగాలి. వీటిపై ప్రభుత్వం ఇప్పటివరకు బీసీ కమిషన్‌కు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి సంకట స్థితిలో పడింది. బీసీ కులగణన కాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఆ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే సంఘాలు.. కులగణన చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఏ పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సర్దుబాటు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవాలే. వీటిని నుంచి తప్పించుకోవడానికే ఎన్నికలు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నదే తప్ప నిజంగా ప్రభుత్వానికి ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తుశుద్ధి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అవకాశాలు తక్కువే అన్నది నిపుణుల మాట!