ఉమ్మడి జిల్లాలో తీర్మానాల పరంపర
జడ్పీ, పరిషత్, పంచాయతీలు, సహకార సంఘాలు, మార్కెట్ కమిటీల్లో ఏకగ్రీవ తీర్మానాలు
కేంద్రం తీరుపై వెల్లువెత్తుతున్న నిరసనలు
ప్రధాని, కేంద్ర మంత్రికి లేఖలు
దేశంలోని ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా తెలంగాణలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని సైతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బరాబర్ కొనాల్సిందేనని జిల్లాలోని పల్లె, పట్టణం, పరిషత్, పీఏసీఎస్‌లో తీర్మాణాల జోరు పెరుగుతున్నది.
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలో తీర్మానాల పరంపర కొనసాగుతున్నది. జడ్పీతోపాటు వివిధ మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు తీర్మానాలు చేస్తూ రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని ఆయా సంస్థల పాలకవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తూ గోయల్ మాట్లాడిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, సోమవారం పలు సహకార సంఘాలు, మార్కెట్ కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ధాన్యం కొనేదాకా ఉద్యమిస్తామని స్పష్టంచేశాయి.
కరీంనగర్, మార్చి 28(నమస్తే తెలంగాణ): కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. వీణవంక మండల ప్రజా పరిషత్తులో కూడా పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మానకొండూర్ మండలం ఊట్నూర్, తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, శంకరపట్నం మండలం కొత్తగట్టు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు తీర్మానించాయి. చిగురుమామిడిలో మండల రైతు బంధు సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు తాసిల్ధార్కు వినతి పత్రం అందించారు.