ప్రజాపాలన గ్రామసభల్లో రెండో రోజూ ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఏ ఊరిలో చూసినా.. ఏ వార్డులో చూసినా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాలుగు పథకాల అమలుపై బుధవారం ఉమ్మడిజిల్లాలో గ్రామ సభలు నిర్వహించగా.. అంతటా ప్రజలు నిరసన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులకు సంబంధించి అర్హుల పేర్లు చదువుతుండగా, ఎక్కడికక్కడ నిలదీశారు. తమ పేర్లు అధికారులు లేవని, అర్హుల ఎంపిక సరిగా జరగలేదంటూ విరుచుకుపడ్డారు. అసలు ఎవరిని అడిగి జాబితాలు తయారు చేశారంటూ ప్రశ్నలు సంధించారు. కొన్నిచోట్ల కన్నీరు పెడుతూ.. దండం పెడుతూ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సంవత్సర కాలంగా రైతు భరోసా ఎందుకు ఇస్తలేరని, గ్యాస్ సబ్సిడీ వస్తలేదని, గృహజ్యోతి ఎందుకు అమలు కావడం లేదని ఆగ్రహించారు. దాంతో సమాధానం చెప్పలేక అధికారులు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రశ్నించారు. ముందు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేయడంపైనా మండిపడ్డారు. చివరకు కొన్నిచోట్ల అధికారులు జాబితాలు మొత్తం చదవకుండానే వెనుదిరిగారు.
‘బిడ్డ పెండ్లి చేసినం. కల్యాణలక్ష్మి చెక్కు ఇచ్చేందుకు రూ. 5వేలు అడిగిన్రు. 3వేలు ఇస్తేనే ఇచ్చిన్రు. మొన్న ఇందిరమ్మ ఇంటి దరఖాస్తు కోసం ఫొటోలు దించేందుకు, మంజూరు చేసేందుకు 500 పంచాయతీ సిబ్బంది వసూలు చేసిన్రు’ అని జగిత్యాల రూరల్ మండలం మోరపల్లికి చెందిన ఇరుగుదిండ్ల గోపాల్- మమత దంపతులు ఆరోపించారు. తమను పంచాయతీ కార్యదర్శి, కారోబార్లు లంచం కోసం వేధించారంటూ గ్రామసభలో అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ విషయమై గ్రామ కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ, వారిని 5వేల లంచం అడగలేదన్నారు. గోపాల్ 5వేల ఇంటి పన్ను గ్రామ పంచాయతీకి చెల్లించాల్సి ఉందని, 3వేలు ఇచ్చారన్నారు. ఈ మేరకు రసీదు సైతం ఉందన్నారు. కాగా, గ్రామ పంచాయతీలో 9/10/2023న ఇరుగుదిండ్ల గోపాల్ పేరిట రాసి ఉన్న 5వేల రసీదును చూపించారు. అయితే గోపాల్-మమత దంపతులు మాట్లాడుతూ, తమ పేరిట ఇల్లే లేద తమకు ఇంటిపన్ను ఎలా వస్తుందని ప్రశ్నించారు.
మాది కీచులాటపల్లి గ్రామం. నేను దివ్యాంగురాలిని. మాకు గుంట భూమి కూడా లేదు. చిన్న గుడిసెలో ఉంటున్నం. నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త శంకర్ గొర్రెల కాపరి. రోజూ కూలీ చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నం. రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఇచ్చిన. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటమని ఆఫీసర్లకు దరఖాస్తు పెట్టుకున్న. లిస్ట్‌లో నా పేరు లేదు. అన్నీ ఉన్నోళ్లకేనా..? మాలాంటి పేదోళ్లను పట్టించుకోరా..? జాబితాలో పేరు లేదని అధికారులకు మొర పెట్టుకుంటే మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలంటున్నరు. ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలె.
జగిత్యాల రూరల్, జనవరి 22 : జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లో గ్రామస్తులు ఇందిరమ్మ ఇండ్ల జాబితాను తిరస్కరించారు. జాబితాలో అనర్హులను ఎంపిక చేశారంటూ అభ్యంతరం తెలిపారు. మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామంలో సర్వే చేసి లిస్ట్ తయారు చేయాలని అధికారులను కోరారు.
ముత్తారం, జనవరి 22: ‘గ్యాస్ సబ్సిడీ పైసల కోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్న. అయినా పైసలు పడ్తలేవు. మీరైనా పడేటట్టు చూడండి’ అంటూ ముత్తారం మండలం ఓడేడ్‌కు చెందిన వృద్ధురాలు దేవునూరి అచ్చవ్వ గ్రామ సభలో అధికారులకు దండం పెట్టి వేడుకున్నది. సార్లు పట్టించుకోవాలని, తనకు సాయం చేయాలని కోరింది. అక్కడే ఉన్న ఎంపీడీవో సురేశ్ సమస్యను పరిష్కరించాలని కార్యదర్శిని ఆదేశించారు. అర్హత ఉండి.. లిస్టులో పేర్లు రానివారు, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మికుంట టౌన్ (హుజూరాబాద్ టౌన్), జనవరి 22: జమ్మికుంట 15వ వార్డులో నిర్వహించిన సభలో అధికారులను ప్రజలు నిలదీశారు. వార్డుకు సంబంధం లేని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వేదికపై ఎలా కూర్చొంటారని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ సభనా..? ప్రభుత్వ కార్యక్రమమా..? చెప్పాలని కమిషనర్‌ను డిమాండ్ చేశారు. అలాగే 24వ వార్డులోనూ కాంగ్రెస్ నేతలు కూర్చోవడం విమర్శలకు తావిచ్చింది.
కమాన్‌పూర్, జనవరి 22: రొంపికుంట సభలో అర్హుల జాబితా చదవగా, దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఏ ఒక్క దళితుడి పేరు లేకపోవడంపై మండిపడ్డారు. అసలు ఈ జాబితాను ఏ ప్రాతిపదికన రూపొందించారని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం గ్రామ సభల పేరిట ఆగం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
నాకు గుంట భూమి లేదు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న. కానీ, అర్హుల జాబితాలో నా పేరు రాలేదు. నాలాంటి పేదలకు కాకుండా ఇంకెవ్వరికి ఇండ్లు మంజూరు చేస్తరు? మాలాంటి వారిపై కనికరం చూపించి ఇండ్లు సాంక్షన్ చేయించండి.
..పక్క చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ముదాం భాగ్య. ఈమెది పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామం. భాగ్య 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకంలో 20రోజులకు పైగా పని చేసింది. వీరికి గుంట భూమి కూడా లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హుల జాబితాలో వీరి పేరు లేదు. జాబితాలో భూమి ఉన్నవారి పేర్లు వచ్చాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జాబితాను ఎవరు తయారు చేశారని మండిపడింది. మొదలే రానప్పుడు.. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పథకాలు వస్తాయా? అంటూ గ్రామ సభ నుంచి వెళ్లిపోయింది.