Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 17: రామగుండం నగర పాలక సంస్థలో ప్రజాధనం కొంతమంది కాంట్రాక్టర్లకు ప్రయోజనంగా మారుతోంది. అభివృద్ధి పనుల్లో ప్రణాళిక లోపం అప్పుడే బయటపడుతోంది. రోడ్డు నిర్మించి మూడు ఐతారాలు కాలేదు.. అప్పుడే భూగర్భ పైపులైన్లు పగుళ్లు చూపడంతో మళ్లీ తవ్వకాలు చేపట్టడం స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడంలో అధికారుల వాటా ఎంతో తేలాల్సి ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రణాళిక లోపం బట్టబయలవుతోంది.
గోదావరిఖని నగరంలోని కోర్టు సమీపంలో గల పైలాన్ జంక్షన్ నుంచి లక్ష్మీనగర్‌లోని ప్రధాన వ్యాపార కూడళ్ల వరకు టీయూఎఫ్ఎడీసీ నుంచి రూ.కోట్ల నిధులతో సిమెంటు రోడ్లు నిర్మించారు. ప్రణాళిక లోపంతో హడావిడి పనులు చేపట్టడంతో రోడ్డు వేసిన నెల రోజులకే మళ్లీ తవ్వకాలు చేపట్టాల్సిన పరిస్థితి దాపురించింది. స్థానిక కోర్టు ప్రక్కన గల్లీ నుంచి లక్ష్మీనగర్ కు వెళ్లే మార్గంలో నూతన రోడ్డు కింద ఉన్న మంచినీటి పైపులైను మూడు రోజుల కిందట పగిలిపోయింది. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు తప్పనిసరిగా భూగర్భ పైపులైను లీకేజీ జరిగిన చోటును గుర్తించేందుకు కొత్తగా నిర్మించిన రోడ్డునే మళ్లీ తవ్వాల్సి వచ్చింది.
నగర పాలక సంస్థలో చాలా అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ అధికారులు ఉన్నప్పటికీ ఇలాంటి తప్పిదాలు జరగడం, రోడ్డు నిర్మించిన నెల రోజులకే భూగర్భ నీటి పైపులైన్లు పగలడం, మళ్లీ ఆ రోడ్డును తవ్వడం ఇదంతా కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడం కోసమేనా..? అన్న ప్రచారం జరుగుతోంది. రోడ్డు నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే మంచినీటి పైపులైన్ లేకేజి తో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. మున్ముందు మరిన్ని చోట్ల కూడా లీకేజీలు జరగవన్న నమ్మకం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఈ నిర్లక్ష్యంకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంఘటనపై పలువురు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకవెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే లక్ష్మీనగర్ లో నిర్మించిన సీసీ రోడ్లు కంకర తేలడం కాంట్రాక్టర్లు, అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. కాగా ఈ విషయమై నగర పాలక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ ను వివరణ కోరగా, అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరగడం సాధారణమనీ, మరమ్మతు పనులు జరుగుతున్నాయనీ, రెండు రోజుల్లో తవ్విన చోట కాంక్రీట్ తో పూడిక పనులు పూర్తవుతాయని చెప్పారు.