పరిశ్రమలకు షాక్ తగలబోతున్నది. నవంబర్ నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టనున్నది. అసలే సబ్సిడీలు రాక, సర్కారు ప్రోత్సహంలేక మూతపడుతున్న పరిశ్రమలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పెరగనున్న విద్యుత్ బిల్లులు భారం కానున్నాయి. మరోవైపు చిన్న, పెద్ద పరిశ్రమలన్నింటికీ ఒకే టారిఫ్ అమలు చేయాలన్న నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమలకు సర్కారు ప్రోత్సాహం కరువైంది. మరోవైపు మాంద్యం నెలకొనడంతో రైస్, జిన్నింగ్ మిల్లుల పరిస్థితి దారుణంగా తయారైంది. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఉపాధి కల్పించే వస్త్ర పరిశ్రమ కుదేలైంది. దీంతో విద్యుత్ సబ్సిడీలు రాక బిల్లులు చెల్లించలేని స్థితిలో యజమానులు కొట్టుమిట్టాడుతుండగా, ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం నవంబర్ నుంచి విద్యుత్తు చార్జీల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నది. హెచ్‌టీ క్యాటగిరీలో విద్యుత్ చార్జీల పెంపు, ఎల్టీ క్యాటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్డ్ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఇప్పటికే ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించగా, పారిశ్రామికుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే పరిశ్రమలు నడవక, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేక లక్షల్లో బకాయిలు పేరుకు పోయాయి. సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థకు ఇప్పటికే 700 కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్నాయి. దీంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అందులో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలే 500 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
పరిశ్రమలను కేటగిరీల వారీగా గుర్తించి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగో కేటగిరీ కింద యూనిట్‌కు 7.65 నుంచి 8.50 వసూలు చేస్తుండగా, మూడో కేటగిరీ కింద యూనిట్‌కు 4 వసూలు చేస్తున్నారు. చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి టారిఫ్ రేట్లు కూడా ఒకేలా ఉండేలా నిర్ణయించే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయం సరైంది కాదంటూ పారిశ్రామికవేత్తలు అభ్యంతరం చెబుతున్నారు. అసలే పరిశ్రమలు నడవక అప్పుల పాలవుతుంటే, సర్కారు విద్యుత్ బిల్లుల భారం మోపి మరింత కుదేలయ్యేలా చేస్తున్నదని మండిపడుతున్నారు.
సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమను నాలుగో కేటగిరీ నుంచి మూడో కేటగిరీకి మార్చాలన్న డిమాండ్ వస్తున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మూడో కేటగిరీలోకి మార్చి యూనిట్ విద్యుత్‌కు 4 చొప్పున, అందులో 2 సబ్సిడీతో చేయూతనిచ్చింది. యూనిట్ విద్యుత్‌కు 2 మాత్రమే యజమానులు చెల్లించారు. పవర్‌లూం వస్త్ర పరిశ్రమకు ఇతర రాష్ర్టాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు యూనిట్‌కు 2లే వసూలు చేస్తూ అండగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల మరమగ్గాలను నాలుగో కేటగిరీలోకి మార్చి యూనిట్ విద్యుత్‌కు 7.65 వసూలు చేస్తున్నది. ఇది తమకు భారమవుతున్నదని ఆసాములు, యజమానులు బకాయిలు కూడా చెల్లించలేదు. మరోవైపు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇవ్వక పోవడంతో సెస్‌పై భారం పడుతున్నది. మరమగ్గాల పరిశ్రమకు వినియోగించే విద్యుత్‌ను మూడో కేటగిరీలోకి చేర్చాలని ఆసాములు, యజమానులు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా 10 హెచ్‌పీల నుంచి 30 హెచ్పీలకు పెంచాలని కోరుతున్నారు.
వ్యవసాయ, మరమగ్గాలకు వినియోగించే విద్యుత్ సబ్సిడీతో సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థపై అదనపు భారం పడుతున్నది. వ్యవసాయ రంగానికి 5 హెచ్‌పీల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తున్నది. రైతులు 7.50 హెచ్‌పీల వరకు మోటర్లు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం 5 హెచ్‌పీల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తుండగా, సెస్‌పై రెండున్నర హెచ్‌పీల విద్యుత్ బిల్లులు భారమవుతున్నాయి. అలాగే, 10 హెచ్‌పీల వరకు మరమగ్గాలకు విద్యుత్ రాయితీ ఇస్తుండగా, 20 హెచ్‌పీల వరకు నడిపిస్తున్నారు. వీటి వల్ల సెస్‌కు నష్టం వాటిల్లుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ సమస్యలు, చార్జీల పెంపుపై ప్రజల నుంచి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) వివరాలు సేకరిస్తున్నది. అందులో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఈఆర్సీ చైర్మన్ రంగారావు హాజరుకానున్నారు. విద్యుత్ సమస్యలపై జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు, పారిశ్రామిక వేత్తలు, గృహ వినియోగదారులు పాల్గొని విద్యుత్ చార్జీల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతి పత్రాలు సమర్పించనున్నారు.
సెస్ పరిధిలో అనేక సమస్యలున్నాయి. వాటన్నింటినీ పాలకవర్గం ఆధ్వర్యంలో విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పిస్తాం. ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని మరమగ్గాలకు కల్పిస్తున్న విద్యుత్ రాయితీలను 10 హెచ్‌పీ నుంచి 30హెచ్పీలకు పెంచాలన్నది డిమాండ్. అలాగే, వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ 5 హెచ్‌పీల వరకు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నది. రైతులు 7.50 హెచ్‌పీల వరకు మోటర్లు వాడుతున్నారు. దీంతో సెస్‌కు నష్టం వస్తున్నందున 7.50 హెచ్పీలకు పెంచాలని కోరుతున్నాం. పాలకవర్గం రెండేళ్లలోనే 11 కోట్లున్న విద్యుత్ డిమాండ్‌ను 22 కోట్లకు తీసుకువచ్చాం. భవిష్యత్తులో 30 కోట్ల నుంచి 40 కోట్లకు పెంచే ఆలోచనతో ముందుకు పోతున్నాం. పెర్ఫార్మెన్స్ బాగా ఉన్నందున పై డిమాండ్లను ముందు పెట్టి సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తాం.