నాడు కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు పెద్దపీట వేసి కానుకలు నేడు కాంగ్రెస్ సర్కారు ఆ సంప్రదాయానికి మంగళం పాడింది. ఇప్పటికే ముస్లింలకు రంజాన్ తోఫా, ఆడబిడ్డలకు బతుకమ్మ చీర ఇవ్వకుండా చేతులెత్తేసింది. తాజాగా క్రిస్టియన్లకు క్రిస్మస్ గిఫ్ట్‌ను కూడా ఎత్తేయగా, ఆయా వర్గాల్లో అసహనం వ్యక్తమవుతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు అందించిన ప్రోత్సాహంతో ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకొన్నారని గుర్తు చేస్తున్నారు. కానీ, రేవంత్ పాలనలో నిరాశే మిగులుతున్నదని వాపోతున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 23 : పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు అనేక పథకాలను తెచ్చి, దశాబ్దకాలంపాటు విజయవంతంగా అమలు చేసింది. స్వరాష్ట్రంలోనైనా అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొనేలా పండుగల నిర్వహణతోపాటు, ఆయా మతాల వారికి నూతన దుస్తులు అందించింది. హిందూ మహిళలకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు ఇఫ్తార్ విందుతోపాటు లాల్చి పైజామా, చీర, చుడీదార్ బట్ట, క్రిస్టియన్లకు చీర, చుడీదార్, ప్యాంటు, షర్టు బట్టలతో కిట్లను 15 రోజుల మందే అందించేది. మసీదుల్లో ఇఫ్తార్ విందులు, చర్చిల్లో క్రిస్మస్ సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసింది.
ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు 3.40 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరెలు ఏటా పంపిణీ చేయగా, 7,500 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా, 4 వేల క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ గిప్టులు అందించింది. ఇలానే మిగతా జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేసింది. దీంతో, సంతోషంగా ఆయా మతాల కుటుంబాలు పండుగలు జరుపుకునేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలకు దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమానికి చెల్లుచీటి పలికింది. మొన్న రంజాన్, నిన్న బతుకమ్మ, నేడు క్రిస్మస్ పండుగలకు పేద, మధ్య తరగతి కుటుంబాలకు మొండిచేయి చూపింది. దీంతో, ఆయా వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
పండుగ వేళలో తాము వేలకు వేలు ఖర్చు చేయలేని స్థితిలో ఉంటే, ఉచితంగా కొత్త దుస్తులు అందించి అప్పటి సీఎం కేసీఆర్ పెద్దన్నలా వ్యవహరించారని, కానీ, నేటి ముఖ్యమంత్రి రేవంత్ పండుగలొస్తే తమను ఆమడదూరం పెడుతున్నారని ఆయా మతాల పేదలు విమర్శిస్తున్నారు. పండుగ దుస్తుల పంపిణీ నిలిపేసిన విషయం తెలియని పేద క్రిస్టియన్లు ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా తమకు కొత్త దుస్తులు అందుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కేవలం క్రిస్మస్ విందులతోనే సరిపెడుతున్నట్టు తెలుస్తుండగా, గిఫ్ట్‌లు ఏవని ప్రశ్నిస్తున్నారు. క్రిస్మస్ రేపే ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో నిరాశ చెందుతున్నారు.