electricity | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 07: విద్యుత్ వినియోగదారులకు కరెంటు సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టిజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ లోని టిజీఎన్ పీడీసీఎల్ సర్కిల్ భవన సముదాయంలో పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని ఏఈ, ఏడిఈ, డిఈ, తదితర విభాగాల విద్యుత్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక చర్యలను త్వరితరగతిన పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తిన వెంటనే పునరుద్దరించాలని సిబ్బందిని ఆదేశించారు.
ముందస్తుగా లోడ్ పెరిగే ట్రాన్స్ ఫార్మర్లను గుర్తించి వాటి స్థానంలో కొత్త ట్రాన్స్ ఫార్మర్లను వాటి సామర్ధ్యం పెంచుతూ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులకు ప్రత్యామ్నాయ లైను(ఇంటర్ లింకు లైన్) ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా ఇంటర్ లింకింగ్ లైన్లును ఏర్పాట్లు తొందరగా పూర్తి చేయాలన్నారు. గత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ కలెక్షన్లలో కంపెనీ పరిధి లో 16 సర్కిల్ లలో పెద్దపల్లికి మొదటి స్థానం వచ్చిన సందర్భంగా పెద్దపల్లి సర్కిల్ విద్యుత్ అధికారులకు , ఓ&ఎం సిబ్బందికి అభినందనలు తెలిపారు.
దీనితో పటు వ్యవసాయ కనెక్షన్ మంజూరు చేయడంలో తక్కువ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నందున పెద్దపల్లి సర్కిల్ వ్యవసాయ కనెక్షన్ మంజూరు చేయడం త్వరితగతిన పని పూర్తి చేయడం వల్లనే మొదటి స్థానం వచ్చినదని దానిని అలాగే కొనసాగించాలని కోరారు. రైతులకు అందుబాటులో ఉంటూ వెంటనే వ్యవసాయ కనెక్షన్ మంజూరు చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.