సాగుకు 3 గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహజ్వాల కొనసాగుతూనే ఉన్నది. కర్షకుల ఆందోళనలతో ఉమ్మడి జిల్లా అట్టుడుకుతూనే ఉన్నది. మూడోరోజు గురువారం కూడా రైతులు కదం తొక్కారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎక్కడికక్కడ నిరసనలతో హోరెత్తించారు. ప్లకార్డులు చేతబూని రేవంత్ దిష్టిబొమ్మలతో శవయాత్రలు తీశారు. సబ్స్టేషన్ల వద్ద ఉరి వేసి, ఆ తర్వాత దహనం చేశారు. ‘రైతు ద్రోహీ రేవంత్. ఉచిత కరెంట్ వద్దన్న కాంగ్రెస్ ఖబడ్దార్’ అంటూ హెచ్చరించారు. మానకొండూర్‌లో ఎమ్మెల్యే రసమయి నియోజకవర్గ రైతులతో కలిసి రైతు దీక్షలో పాల్గొని, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పే వరకు గ్రామాల్లో తిరగనీయవద్దని పిలుపునిచ్చారు.
కరీంనగర్, జూలై 13(నమస్తే తెలంగాణ): ఉచిత కరెంట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వైఖరిపై కర్షకలోకం భగ్గుమన్నది. మూడోరోజూ గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. రైతుల బతుకుల్లో చీకట్లు నింపేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ తీరును ఎండగట్టింది. సబ్స్టేషన్ల ఎదుట రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను కాల్చివేసి కోపాగ్నిని ప్రదర్శించింది. ‘రైతు ద్రోహి రేవంత్..కాంగ్రెస్ వద్దు..బీఆర్ఎస్ ముద్దు’ అంటూ నినదించింది. వీరికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది. మానకొండూర్ సబ్‌స్టేషన్ ఎదుట రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు ఉరి తీశారు. ఎమ్మెల్యే రసమయి, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. కరీంనగర్‌లోని ఓ కాంగ్రెస్ నేత ఇంటి ఎదుట జీకే యూత్ సభ్యులు రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ఆధ్వర్వంలో రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి తీశారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోనూ ధర్నాలతో హోరెత్తించారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో రైతులు దిష్టిబొమ్మలతో శవయాత్ర చేశారు. సబ్స్టేషన్ల ఎదుట దహనం చేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి వద్ద పదివేల మందితో చేపట్టిన నిరసనలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు. అలాగే సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ జిల్లా, పట్టణ అధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, టీఎస్‌టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు, బీఆర్ఎస్ నాయకులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కోరుట్ల శివారులోని కల్లూరు, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ సబ్స్టేషన్ల ఎదుట అన్నదాతలు ధర్నాకు దిగారు. రేవంత్ దిష్టిబొమ్మలతో శవయాత్రలు చేసి దహనం చేశారు. కరెంట్ వద్దంటున్న కాంగ్రెస్‌ను పాతరేస్తామని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా హస్తంపార్టీ వ్యతిరేక ధర్నాలతో హోరెత్తింది. గోదావరిఖని రామమందిర్ సబ్‌స్టేషన్ వద్ద ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో రైతాంగం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కదంతొక్కింది. గోదావరిఖనిలోని రాంమందిర్ సబ్‌స్టేషన్ వద్ద ఫ్లకార్డులతో బైఠాయించి రేవంత్ దిష్టిబొమ్మకు ఉరితీశారు. అనంతరం అక్కడే కాల్చివేసి కోపాగ్నిని ప్రదర్శించారు. అంతర్గాం మండలం ఆకెనపల్లి ఉప విద్యుత్ కేంద్రం వద్ద పీసీసీ అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. మంథని పట్టణం పవర్‌హౌస్‌కాలనీ సబ్‌స్టేషన్ వద్ద దిష్టిబొమ్మను కాల్చివేశారు.
నమ్ముకుంటే మన్ను బుక్కుడే
తొమ్మిదేండ్ల కింద కాంగ్రెస్ సర్కారు తొమ్మిది గంటల కరెంటు ఇత్తమని చెప్పింది. అది ఎప్పడొచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెల్వకపోతుండె. తెల్లందాక పొద్దుందాక పొలం కాడనే సచ్చినం. ఎటు పోదామన్నా కరెంటత్తదని ఆశతో చెట్టుకింద కాపలా గాసినం. ఇంట్ల కెళ్లి సద్ది గట్టుకుని పొలం కాడనే తినేటోళ్లం. కరెంటు వత్తె ఎట్లనని నిద్ర కూడా పోలేదు. నాకున్న మూడెకరాల్లో వరేత్తే వచ్చిన మూడు గంటల కరెంటుతో మూల తడవలే. నీళ్లకు గోసనే, కరెంటుకు తండ్లాటనే. కరెంటు అట్లిత్తం, ఇట్లిత్తమన్నోళ్లు చీకట్లనే ఉంచిన్రు. వరికగ్గ్గిదగలనుకుని పత్తులేస్తే ఎరువులు దొరక్క అట్ల గోసపడ్డం. ఇత్తులు, ఎరువులు, కరెంటు ఒక్కటా రెండా ఎవుసాన్ని పాపిష్టోళ్లు పాడు చేసిన్రు. గాళ్లను నమ్ముకుంటే మన్ను బుక్కుడే అయితది. కేసీఆర్ అచ్చినంక కడుపు నిండా తింటున్నం. కంటి నిండా నిద్రపోతున్నం. కరెంటు కోసం ఎదిరి సూత్తలేం. మోటరు చాల్పెట్టి అన్ని పనులు జేసుకుంటున్నం. పుట్లకొద్ది వడ్లత్తనయ్. పత్తుల జాడలేదు. దొడ్డు రకం, సన్న వడ్లు రెండురకాల పంటేస్తున్న. ఇపుడే మంచిగున్నది. మళ్లా కేసీఆర్ సారే రావాలి.
– లింగంపల్లి పోచయ్య రైతు, బోనాల (రాజన్న సిరిసిల్ల జిల్లా)
ఏడు గంటలే సరిపోలే..
నాకు మూడెకరాల భూమి ఉన్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు ఏడు గంటలు కరెంటు పొద్దున, రాత్రి ఇస్తేనే సరిగా పొలం పారకపోయేది. అట్లాంటిది ఇప్పుడు అదే పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి మూడుగంటలు సరిపోతది అని మాట్లాడుడు చూస్తే ఆయనకు రైతులంటే ఏపాటి ప్రేమున్నదో తెలుస్తంది. ఇసోంటి నాయకులా..? మేం పరిపాలిస్తం.. మేం ఏలుతమని ముర్తర్రు. పుసుక్కున వీళ్లు గిట్ల అధికారంలోకి వస్తే ఇగ రైతులు ఆగమవుడె. టీడీపీ ప్రభుత్వంల ఉన్న పరిస్థితే వస్తది. ఇట్లాంటి నాయకులకు అధికారంల ఉన్నా, లేకున్నా రైతులంటే చిన్నచూపే ఉంటది. నేను రైతును, భూసామిని అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి ఆయన పొలానికి ఎన్నడన్న పోయి చూసిండా..? ఈ మాత్రం అవగాహన లేనోన్ని రాష్ట్ర అధ్యక్షుడిని ఎట్ల చేసిన్రు? రైతులకు ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతరో అర్థం కాదు. ఇప్పుడు మన పరిస్థితి ఎంత మంచిగున్నది. పారకానికి కాళేశ్వరం నీళ్లు ఉన్నయి. ఎప్పుడంటే అప్పుడు బాయికాడికి పోయి కరెంటు పెట్టుకోనేటట్టు రోజంతా కరెంటు ఉంటంది. ఎరువుల కోసం ఇప్పటివరకు తెలంగాణ వచ్చినసంది ఎక్కడ లైన్ల నిలవడ్డది లేదు. అమ్ముకోవడానికి ఇబ్బందులు లేవు. బాయిలల్ల నీళ్లు ఒడ్తయనే బాధ లేదు. పెట్టుబడికి పైసలు, భరోసాకు బీమా.. ఒక రైతుకు ఇంత కంటే ఏం కావాలే. – దావు సంపత్‌రెడ్డి, రైతు, రామకృష్ణకాలనీ (కరీంనగర్ జిల్లా)
మా ఐక్యత ఏందో చూపిస్తం
నాకు ఆరెకరాల పొలం ఉన్నది. తెలంగాణ రాక ముందు కరెంట్, నీళ్లు లేక మూడెకరాలే సాగు చేయకపోయేది. మక్క, పల్లి, పత్తి సాగు చేసి మస్తు గోసపడ్డ. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రోజుల తరబడి పంటకు సకాలంలో నీరు అందకపోయేది. అప్పుడు పంటలు ఎండిపోయి పశువుల మేతకు అయ్యేది. పెట్టుబడి కూడా రాకపోయేది. రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లకు, కరెంట్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. తొమ్మిదేళ్లుగా ఆరెకరాల్లో రెండు పంటలూ వరే సాగు చేస్తున్న. 24గంటల కరెంట్ ఇచ్చుడుతోని ఎప్పడంటే అప్పుడు పొలానికి వచ్చి నీళ్లు పెట్టుకుంటున్న. ఇప్పుడు ఏ గోసా లేదు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులు ఇప్పుడు మంచిగున్నరు. ఎవుసం అంటే ఏందో తెలియని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలే కరెంట్ చాలని మాట్లాడడం సరికాదు. రైతులను అవమానించేలా మాట్లాడిన ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా రైతుల ఐక్యత ఏందో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తం. రైతు బాంధవుడైన కేసీఆర్‌కు మేం అండగా ఉంటం.
-మూగల శ్రీనివాస్‌రెడ్డి రైతు, పెద్దపాపయ్యపల్లి (హుజూరాబాద్ మండలం)
ఎవుసం జేసుడు ఉండది
నాకు ఎనిమిదెకరాల భూమి ఉన్నది. 12 గంటలు రెండు బావులు నడిస్తే తప్ప నేను ఎవుసం చేయలేను. గతంలో నాలుగెకరాల్ల ఎవుసం చేసే నేను సీఎం కేసీఆర్ పుణ్యమాని 24గంటల కరెంటుతో నాకున్న ఎనిమిదెకరాలు సాగు జేసుకుంటున్న. రేవంత్‌రెడ్డి అన్నట్టు 3గంటల కరంటిస్తే మేం ఎవుసం జేసుడు బందైతది. పాత రోజులే వస్తయ్. తెలంగాణ రాక ముందు 9గంటల కరంట్ అనుడే తప్ప మూడు గంటలు కూడా సక్కగా రాలేదు. అది ఎప్పుడు అచ్చేదో పోయేదో తెలిసేది కాదు. అర్ధరాత్రి పొలాల కాన్నే పడుకొని కరంట్ కోసం ఎదురుచూసేది. కరంట్ రాంగనే రైతులందరు ఒకే సారి మోటర్లు పెట్టెటోళ్లు. లోఓల్టేజీ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి నష్టం వచ్చేది. పంటలకు నీళ్లు సక్కగా అందకపోయేది. సీఎం కేసీఆర్ వచ్చినంక 24గంటల పాటు కరంట్ ఇస్తండు. అందుకే నేను నాకు ఉన్న పొలాలకు నాలుగు దిక్కుల పైపులు పెట్టుకుని నీళ్లు పారించుకుంటున్న. ఎవుసం చేసెటోళ్లకు కరెంటు ఎన్ని గంటలు కావాలో తెలుస్తుది. రేవంత్‌రెడ్డి ఏం తెస్తున్నది. మూడు గంటలు ఇస్తె రైతులు ఎవుసం బంద్ పెట్టుకుని కైకిలీ, కూలీలకు పోవుడే అయితది. సీఎం కేసీఆర్ స్వయంగా రైతే కాబట్టి ఆయనకు మా బాధలన్నీ తెలుసు. అందుకే ఆయన మా బాధలన్నీ దూరం జేసిండు.
– పాకాల సంపత్‌రెడ్డి, రైతు, కొలనూర్(ఓదెల)
ఆరోజులు మళ్ల రావద్దు
మూడేళ్ల కింద మా ఊరు బల్యాల నగర్‌ను సిరిసిల్లలో కలిపిన్రు. మా నాయనకు నాలుగు ఎకరాలుంది. నాయినతో నేను పొలం జూసుకుంటున్న. పదేండ్ల కింద సర్కారు కరెంటే సక్కగియ్యలే. వరేసి కరెంటు మోటరు పెట్టేందుకు నాయనతో కలిసి పొలం కాడనే పడుకునేది. తాపకోసారి లేసి కరెంటు వచ్చిందా..? అని సూసుకునేది. నేను నిద్రపోతే మానాయన తెలివితోటి ఉండి కరెంటు రాంగనే మోటారు చాల్ జేత్తుండే. వచ్చిన కరెంటుతో మడులే మునగలేదు. రాత్రి, పొద్దుగాల పొలం కాడనే ఎల్లదీసినం. వచ్చిన కరెంటు ఎప్పుడు లోవోల్టేజీ వచ్చి మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు ఖాళీ పోతుండే. వడ్లమ్మిన పైసలన్నీ కరెంటు మోటర్ల రిపేర్లకే పెట్టుడైంది. ఆ రోజులు మళ్ల రావద్దని దేవుడిని మొక్కుకున్నం. కేసీఆర్ సార్ వచ్చినంక కరెంటు ఫుల్‌గా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు అప్పుడు తక్కువుండే. ఇపుడు మస్తుగా పెట్టిన్రు. లోవోల్టేజీ అన్నదే లేదు. కేటీఆర్ సార్ సల్లంగుండ మూడూళ్లకో సబ్‌ష్టేషన్ పెట్టించి కరెంటు గోస తీర్చిండు. కేసీఆర్ సార్ జెయ్యవట్టి రైతులకు న్యాయం జరుగుతుంది. అన్ని సౌలతులు జేసిండు. పంటలు బాగున్నయంటే సార్ జెయ్యవట్టే.
– బల్యాల గోపాల్, బల్యాల నగర్ (రాజన్న సిరిసిల్ల జిల్లా)
ఆ కష్టాలింకా మర్చిపోలే
కాంగ్రెస్ పాలనలో రైతులం అరిగోసపడ్డం. కరెంట్ కోసమైతే మస్తు ఆగమైనం. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పొలంకాడికి పోయినం. ఒక్క ఎకురం పారిచ్చేతందుకు రోజంతా పొలంకాన్నే గడిపినం. ఆ కష్టాలింకా మర్చిపోలే. ఇప్పుడు మేం మంచిగా ఎవుసం జేసుకుంటున్నం. మూడు గంటల కరెంటు ఎవుసానికి ఏ మాత్రం సరిపోదు. ఎకురం కూడా సక్కగ పారది. నాకు 5 ఎకురాలు ఉంది. 15 ఏండ్లుగా ఎవుసం చేస్తున్న. ఎకురానికి గంట కరెంట్ ఇస్తే పారదు. కనీసం రెండున్నర గంటలు పడుతుంది. పూర్తిగా తడవాలంటే మూడున్నర గంటలు పడుతది. గతంలో నేను మూడెకరాలే సాగు చేసెటోన్ని. ఇప్పుడు 24 గంటలు కరెంట్‌తో నా 5 ఎకరాలకు పుషలంగా నీరందుతున్నది. పంటలు ఆనందంగా పండిచ్చుకుంటున్నం. రైతులు మంచిగా ఉండుడు చూసి కాంగ్రెసోళ్లు ఓర్వలేకపోతున్నరు. మమ్మల్ని ఆగం చేయాలని చూస్తున్నరు.
– ఎంబాడి రాకేశ్, పెరకపల్లి (సుల్తానాబాద్ మండలం)
అధ్యక్షుడిని ఎట్ల చేసిన్రో..?
కేసీఆర్ ప్రభుత్వం రైతుల మేలు కోరి 24 గంటల కరెంట్ ఇస్తుంటే రేవంత్‌రెడ్డి మూడు గంటలిస్తే చాలు అని అంటున్నడు. ఆయనకు ఎవుసం గురించి ఏం తెలుసు? మా లెక పొలంలో పనిచేస్తే ఎన్ని గంటల కరెంటు అవసరం ఉంటుందో తెలుస్తది. గాలి మాటలు మాట్లాడుడు కాదు. పొలానికి నీళ్లు పెట్టాలంటే ఎకరానికి రెండు కరెంటు పెట్టాలి. శెవుకలో పత్తి, మకకు నీళ్లు కట్టాలంటే ఎకరానికి మూడు గంటలు పడుతుంది. ఏం తెలువనోన్ని తీసుకచ్చి ఆ పార్టీకి అధ్యక్షుడిని పెట్టిన్రు. అప్పుడు కాంగ్రెస్ పాలనల చూసిన కష్టాలు చాలు. కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలియదు. ఇంకా లో వోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండె. ఆ ఏడు గంటల కరెంటు కూడా సక్కగ రాక బావులల్లో నీళ్లు లేక పొలాలు ఎండిపోతుండె. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధు, నీల సౌలతి మంచిగా ఉండడంతో నేను ఏడెకరాలు కౌలుకు చేస్తున్న. మాకు ఏ బాధా లేదు.
– సాయిల్ల కనకయ్య, రైతు (చొప్పదండి)