కాంగ్రెస్ దగాపై బీసీలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. 42శాతం రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోర్టులో నిలబడదని సీఎం, మంత్రులు సహా నాయకులందరికీ ముందే తెలిసినా చట్టబద్ధత లేని జీవోను విడుదల చేసి మరోసారి మోసం చేసిందని ధ్వజమెత్తారు. శుక్రవారం ఎక్కడికక్కడ రోడ్లెక్కి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. కాంగ్రెస్‌కు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. తమకు రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్న బీసీ వ్యతిరేక శక్తులకు కూడా తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
కరీంనగర్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా దగా చేయడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు శుక్రవారం నిరసనలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో రెడ్డి జాగృతి దిష్టి బొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేదర్ విగ్రహానికి జిల్లా కమిటీ బాధ్యులు, సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి వినతి పత్రం అందజేశారు.
చిగురుమామిడిలో బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాతబస్టాండ్ శాస్త్రి విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కొడిమ్యాల మండల కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు పట్టణ బంద్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ క్రాస్‌రోడ్ వద్ద పెద్దపల్లి – మంథని ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమను ఆది నుంచే మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నదని, అందులో భాగంగానే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని స్పష్టం చేస్తున్నారు.
అత్యధికంగా ఉన్న బీసీల ఓట్లు దండుకోవడానికి కామారెడ్డి సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. 60శాతానికిపైగా ఉన్న తాము ‘మేమెంతో మాకంత వాటా’ కావాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అయినా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో నమ్మి ఓట్లేశామని, తీరా తమను మోసం చేసిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, జీవో నిలబడదని తెలిసినా విడుదల చేసిందని మండిపడ్డారు. రిజర్వేషన్లను నిలబెట్టుకునేందుకు ఏ రోజు కూడా చిత్తశుద్ధితో కృషి చేయలేదని, ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌తోపాటు కాంగ్రెస్ లీగల్ సెల్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నదని ఆరోపిస్తున్నారు. కోర్టుకు వెళ్లిన వారిని సమాజం నుంచి బహిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా పిలుపునిచ్చారని, తిరిగి ఆయనే తన శిష్యుడైన మాధవరెడ్డితో హైకోర్టులో కేసు వేయించాడని ఆరోపిస్తున్నారు. ఆ పార్టీకి చిత్త శుద్ధి ఉంటే గవర్నర్ వద్ద ఉన్న రిజర్వేషన్ల బిల్లును ఆమోదింప జేసేదని, పార్లమెంట్లో బిల్లు పెట్టించేందని చెబుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లరాదని స్పష్టం చేస్తున్నారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీలంతా ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. రిజర్వేషన్లు సాధించుకునే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలయ్యే వరకు దశల వారీగా ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ మొదటి నుంచి బీసీలను మోసం చేస్తున్నది. రిజర్వేషన్లు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టంతో పాటు రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఆ తర్వాత కూడా 9వ షెడ్యూల్లో ఆ చట్టాన్ని పొందుపరిచినప్పుడే చట్టబద్ధత వస్తుంది. న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకోలేవు. ఈ విషయం ఇప్పటికే న్యాయ నిపుణులు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 50 శాతానికి పైగా రిజర్వేషన్లు పెంచుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సైతం న్యాయస్థానాలు ఆ ఎన్నికలను కొట్టివేశాయి. ఈ విషయం అనుభవంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానంతో జీవో 9 జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం పకా బీసీలను మోసం చేయడమే. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వారికి రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగ అంశాల్లో రిజర్వేషన్లు పెంచాలి. అందుకోసం పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింపజేసి, రాష్ట్రపతితో సంతకం చేయించి షెడ్యూల్ తొమ్మిదిలో పొందుపరిచేలా ప్రయత్నించాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇతర పార్టీలు ప్రయత్నించాలి.
– బ్రహ్మాండభేరి నరేశ్, బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ఎక్కడా చిత్తశుద్ధి లేదు. ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పి మభ్యపెట్టింది. అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పి చేతులు దులుపుకొన్నది. కోర్టులో నిలబడదని తెలిసినా జీవో ఇచ్చి మరోసారి మోసం చేసింది. జీవో ఇచ్చినట్టే ఇచ్చి వెనక నుంచి కొందరు పెద్దలను కలుపుకొని కోర్టుల్లో కేసులు వేయించారు. బీసీల ఓట్లు దండుకొనేందుకు రిజర్వేషన్ డ్రామాలు ఆడుతున్నారు. దీనిని వ్యతిరేకిద్దాం. శనివారం చేపడుతున్న బంద్‌కు బీసీలందరూ ఐక్యంగా కలిసి రావాలి.
– శ్రీధర్‌రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం బీసీలే. అలాంటి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోతున్నది. జీవో పేరిట మరోసారి మోసం చేసింది. బీసీల మనోభావాలతో ఆడుకుంటున్న ప్రభుత్వానికి పుట్టగతులుండవ్. ఆ పార్టీకి బీసీలు భవిష్యత్తులో సరైన సమాధానం చెబుతరు. అందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నరు.
– గంట అశోక్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు (గంభీరావుపేట)
కామారెడ్డి సభ సాక్షిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించిండు. ఇచ్చిన హామీ కోర్టులో నిలువదని తెలిసినా జీవో ఇచ్చి మభ్యపెట్టిడు. బీసీ రిజర్వేషన్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నం. ఆశలన్నీ నీరుగార్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్టే. బీసీల తడాఖా ఏమిటో మున్ముందు చూపిస్తం. బీసీలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి.
– పోరండ్ల రమేశ్, బీసీ సంఘం నాయకుడు (సిరిసిల్ల)
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తామని పార్టీలు చెప్పడమే తప్ప అమలు చేసింది లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు. 42 శాతం రిజర్వేషన్ హామీ కూడా మరో మోసమేనని నిరూపితమైంది. కోర్టులో నిలువదని తెలిసినా బీసీలను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పుడు కొంతమంది అగ్రవర్ణాలతో కేసులు వేయించి మరోసారి బీసీలకు అన్యాయం చేసింది. జనాభాలో బీసీలు 50 శాతం దాటినా రిజర్వేషన్ మాత్రం 23 శాతానికే పరిమితం చేసింది. 2 శాతం లేని అగ్రవర్ణాలకు మాత్రం 10 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. బీసీలకు సామాజిక న్యాయం అందకుండా పోతున్నది. ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. స్టే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలి. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.
– బొల్లం లింగమూర్తి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నది. కామారెడ్డి డిక్లరేషన్‌లో మోసపూరితమైన వాగ్దానాలు చేసింది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయింది. కోర్టులో కొట్టుడుపోతుందని తెలిసే చట్టబద్ధత లేని జీవోను విడుదల చేసింది. అది కోర్టులో నిలబడకపోవడం వెనుక కాంగ్రెస్ కుట్ర కచ్చితంగా ఉంది. జనాభాలో అధికశాతం ఉన్న బీసీలం మొదటి నుంచీ ‘మేమెంతో మాకంత’ నినాదంతో ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ నిజానికి మాకు కేవలం 5 శాతం రిజర్వేషన్లే పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 27 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన 42 శాతంలో ముస్లింలకు 10 శాతం పోతే మాకు దక్కేది కేవలం 32 శాతమే కదా! అంటే మాకు పెంచింది కేవలం 5 శాతమే కదా! కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. మునుపటిలాగా మోసపోయే పరిస్థితి లేదు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి.
– ఎన్నం ప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
చట్టం కాదని తెలిసి కూడా రిజర్వేషన్ల పేరుతో లబ్ధి పొందాలని చూసిందే రేవంత్‌రెడ్డి. ఈడబ్ల్యూఎస్ కోటా ఒక్కరోజులో తీర్మానించే 10 శాతం రిజర్వేషన్ తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేయించింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఆ తర్వాత కోర్టులో తన అనుచరుడైన మరో రెడ్డితో కేసు వేయించి నోటికాడి బుక్క దూరం చేసింది కూడా ఆయనే. నేను ఇచ్చినట్టు చేస్తా.. నువ్వు గుంజుకున్నట్టు చెయ్యి అని ఆడిన నాటకం ఇది! బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరూ కేసు వేయవద్దని అప్పీల్ చేస్తే ముఖ్యమంత్రే ఆయన అప్పీల్‌ను వినకుండా ఆయన అనుచరుడితో కేసువేయించి బీసీలను మోసం చేశారు.
– నల్లవెల్లి శంకర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం దకాల్సిన రిజర్వేషన్లు దకకుండా అడ్డుపడుతున్నది రెడ్డి సామాజిక వర్గీయులే. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై స్టే వచ్చేలా రెడ్డి జాగృతి సంఘం నాయకులు బీసీలకు వ్యతిరేకంగా కేసులు వేశారు. హైకోర్టులో కేసులు వేసిన వారికి డబ్బులు పంపింది, ఈ కేసుల వెనుక ఉన్నది రెడ్డి రాజకీయ నాయకులే. అందుకే రెడ్డి కులం నాయకులు కనీసం బీసీల తరఫున సానుభూతిని ప్రకటించలేదు. ఇక నుంచి ఎన్నికల్లో పోటీచేసే రెడ్డి రాజకీయ నాయకులకు మా బీసీల ఓట్లు అడిగే హకు లేదు.
– కందుల సదాశివ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డి సరార్ బీసీ బిడ్డలను నయవంచనకు గురిచేసింది. ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మభ్యపెట్టింది. రిజర్వేషన్ల పెంపు, అమలు కేంద్రం పరిధిలోనిదని, పార్లమెంట్ చట్టంతోపాటు రాష్ట్రపతి ఆమోదించాలన్న విషయం స్పష్టంగా తెలిసినా జీవో ఇచ్చి మోసం చేసింది. రేవంత్ తన మాటల గారడీతో బీసీ బిడ్డలను దగా చేశారు. గవర్నర్ ఆమోదం లేకుండా రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతాయని ముందడుగు వేశారో అర్థం కావడం లేదు. 55 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే బీసీలను అవమాన పరచడమే. సరైన పద్ధతిలో బీసీల సర్వే చేయకుండానే నివేదికలు సమర్పించడం సరికాదు. బీసీలకు పూర్తి న్యాయం చేయడం లేదు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లను సరైన పద్ధతుల్లో అమలు చేయాలి.
– భూమి రమణ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి
దేశంలో ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఒక్క బీసీ నాయకుడు గానీ, ఒక్క సంఘం గానీ వ్యతిరేకించలేదు. ఈ చట్టాన్ని కాంగ్రెస్ వెంటనే అమల్లోకి తెచ్చి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించింది. మరి జనాభాలో 52 శాతానికి మించి ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తేనే అగ్రవర్ణాల్లోని కొంతమంది పెద్దలకు ఎక్కడాలేని కోపం వస్తున్నది. వీరికి ప్రభుత్వంలోని కొంత మంది పెద్దల హస్తం కూడా ఉంది. కోర్టుల్లో నిలబడే అవకాశం లేదని తెలిసి కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆపై వెంటనే కోర్టుల్లో కేసులు వేయించి బీసీలకు అన్యాయం చేసింది.
– దొగ్గలి శ్రీధర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి (కరీంనగర్)