కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 23 : కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. పలుచోట్ల ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేసి, దాడిని తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యాటకులపై దాడి చేయడం పిరికిపంద చర్య అని పేర్కొన్నారు.
పర్యాటకులకు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో జడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్, నాయకులు షౌకత్, సాబీర్, ఇర్ఫాన్, ఫక్రుద్దీన్, మన్సూర్ పాల్గొన్నారు.