Singareni | గోదావరిఖని : బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు నాయకులు వెల్లడించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, సీఐటీయూ నాయకులు రాజారెడ్డి హెచ్ఎంఎస్ నాయకులు మాట్లాడారు. జూన్ 30 2026 తో 11వ వేతన ఒప్పంద కాల పరిమితి ముగుస్తుందని 1 జులై 2026 నుంచి 12వ వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు కమిటీ వేయలేదని నాయకులు విమర్శించారు.
కోల్ ఇండియాలో జులై 1న నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన క్రమంలో సింగరేణి సంస్థలు జూలై 3న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేతన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వారు వివరించారు. జూలై3న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ తో పాటు రామగుండం, శ్రీరాంపూర్, భూపాలపల్లి, బెల్లంపల్లి డివిజన్లో జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేయడానికి నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.