Sircilla | సిరిసిల్ల టౌన్, మార్చి 13 : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల సెస్ పరిధిలోని అసిస్టెంట్ హెల్పర్లు చేపట్టిన విధుల బహిష్కరణ మూడో రోజుకు చేరింది. సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) కార్యాలయం ఎదుట భార్యాపిల్లలతో కలిసి అసిస్టెంట్ హెల్పర్లు శుక్రవారం నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ అసిస్టెంట్ హెల్పర్లను జూనియర్ లైన్మెన్ గా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న ఎఫ్టీఏ వెంటనే చెల్లించాలని అన్నారు.
విద్యుత్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు. తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల విధుల బహిష్కరణ నేటితో మూడవ రోజుకు చేరుకుoదన్నారు. అసిస్టెంట్ హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో అనేకసార్లు పాలకవర్గానికి వినతి పత్రాలు ఇచ్చిన ఎటువంటి స్పందన లేదన్నారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల స్వామి, జిల్లా అధ్యక్షుడు కరుణాల అనిల్, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.