Chandurthi | చందుర్తి, మే26 : తమకు చెల్లించాల్సిన బిల్లుల జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఘటన మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన లాండే సంతోష్ 2025 లో ఉపాధి హామీ పథకం కింద రోడ్ల మరమ్మతులకు సుమారు 200 ట్రిపుల మట్టిని తరలించారు. బిల్లు చెల్లింపుల్లో జాప్యం ఉంటుందని మొదటే వివరించిన సంతోష్ అధికారుల పూచికత్తుతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నానని తీరా చూస్తే అధికారులు చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు ఏడాది గడుస్తున్న అధికారులు దాటవేసే సమాధానం చెప్పడంతో పాటు పనికి సంబంధించిన ఆధారాలు తీసుకురావాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని మొదట్లో ఒకలా పూర్తయ్యాక మరోలా వ్యవహరించడమే కాక డబ్బులు చెల్లింపులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఏపీవో రాజయ్యను వివరణ కోరగా పనులకు సంబంధించిన పేమెంట్ రికార్డు చేశామని, డబ్బులు రాగానే చెల్లిస్తామని ఆయన తెలిపారు.