Huzurabad | హుజూరాబాద్ రూరల్, జనవరి 27 : హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో నియోజకవర్గ కేంద్రంలో ఉద్యమం మళ్లీ రాజుకుంది. హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ, ఆందోళన నిర్వహించారు. కెమిస్ట్-డ్రగిస్ట్ అసోసియేషన్, శ్రీ విగ్నేశ్వర ఆర్ఎంపీ-పీఎంపీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి తమ డిమాండ్‌ను విన్నవించారు. బస్సు డిపో చౌరస్తాలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభించి సైదాపూర్ చౌరస్తా మీదుగా డాక్టర్ బీఆర్. అంబేద్కర్ చౌరస్తా వరకు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి నిరసనకారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ‘హుజురాబాద్ జిల్లా-మన హక్కు’ అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది.
అనంతరం ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోద్ సదానందం మాట్లాడుతూ హుజురాబాద్ కంటే జనాభా, వైశాల్యం, భౌగోళిక విస్తీర్ణంలో చిన్నవైన ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించినా అన్ని అర్హతలున్న హుజురాబాద్‌ను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్షాళన చేపట్టనున్న నేపథ్యంలో వెంటనే హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని, ఈ జిల్లాకు భారత మాజీ ప్రధాని, ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు పేరు పెట్టాలని (పీవీ జిల్లా) వారు డిమాండ్ చేశారు.
సుమారు రెండు గంటల పాటు వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై ర్యాలీ ఆందోళన నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడటంతో టౌన్ సీఐ కరుణాకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు.
అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ నాయకులు కర్ర పాపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశం, ఆర్ఎంపీ, పీఎంపీల మండల అధ్యక్షుడు కందగట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిలకమారి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు అడ్డగట్ల కృష్ణమూర్తి, కొలిపాక జగదీష్, మంచికట్ల సదానందం, పిట్ట శ్రీనివాస్, ఇప్పనపల్లి శ్రీనివాస్, జేఏసీ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పొడిశేట్టి వెంకటరాజం, వేల్పుల రత్నం, చందుపట్ల జనార్ధన్, వేల్పుల ప్రభాకర్, వెంకటేష్‌తోపాటు పెద్ద సంఖ్యలో ఆర్ఎంపీలు, పీఎంపీలు, కెమిస్ట్-అండ్ డ్రగ్గిస్ట్ నాయకులు పాల్గొన్నారు.