జగిత్యాల రూరల్, ఆగస్టు 20 : జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట రైతువేదిక వద్ద రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో 300 మంది రైతులుంటే మూడు విడతల్లో కలిపి కేవలం 50 మందికే మాఫీ జరిగిందని మండిపడ్డారు. మొదటి విడతలో 10 వేలు, 80 వేలు ఉన్న రైతులకు కూడా పూర్తి స్థాయిలో మాఫీ కాలేదన్నారు. బ్యాంకులకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రేషన్‌కార్డుకు సంబంధం లేకుండా అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
చిగురుమామిడి, ఆగస్టు 20: రైతులందరికీ రుణమాఫీ చేయలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చిగురుమామిడి మండలానికి చెందిన సుమారు 150 మంది రైతులు అల్టిమేటం జారీ చేశారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ మండల నాయకులు సంఘీభావం ప్రకటించి, నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రం కావడం, హుస్నాబాద్ కరీంనగర్ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళన విరమించాలని కోరినా శాంతించకపోవడంతో బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మిగతా రైతులు తహసీల్ ఆఫీస్‌కు వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్‌విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కర్వేద మహేందర్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, నాయకులు పాల్గొన్నారు.