Vemulawada | వేములవాడ, మే 28: వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఆస్తి వివాదం తెరకెక్కింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసి భవనాన్ని నిర్మిస్తుండగా దానిని తప్పుడు తీర్మానాలతో ట్రస్ట్ గా మార్చడాన్ని వివాదానికి తెరలేపింది. సంఘం ఆస్తిని ఎలా ట్రస్ట్ గా మారుస్తారని సంఘ పెద్దల జోక్యంతో పోలీసుల వరకు చేరుకోవడంతో వేములవాడ పట్టణంలో ఈ వివాదం చర్చని అంశంగా మారింది. ఇక వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇందులో దాదాపు 1800 మంది సభ్యులు ఉండగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుని ఎన్నుకునే విధానం ఉంది.
ఇక వేములవాడ ప్రముఖ పట్టణం కావడంతో సభ్యుల సంఖ్య పెరిగిపోయి, కనీస వసతి సౌకర్యాలు ఉండాలని భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అప్పటి అధ్యక్షుడు చేపూరి రవీందర్ భవిష్యత్ తరాలకు మరింత విశాలమైన స్థలం అవసరమని అప్పటి సంఘ సర్వసభ్య సమావేశంలో తీర్మానించి రెండు గుంటల స్థలాన్ని విక్రయించి 2008 సంవత్సరంలో రూ.12 లక్షల 80 వేలతో సర్వేనెంబర్ 777లో ఎనిమిది గంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2023 సంవత్సరంలో నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఆర్యవైశ్య సంఘంలోని కొందరు పెద్దలతో పాటు ఇతర రాజకీయ నాయకులు అందజేసిన అభివృద్ధి నిధులతో రూ.6500 అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ అంతస్తు నిర్మాణానికి పనులు ప్రారంభించి స్లాబులు వేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అయితే అప్పటి అధ్యక్షుడు రేణికింది అశోక్ భవన నిర్మాణానికి కమిటీ వేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో సదర్ అధ్యక్షుడి ఎన్నిక సమయం ముగిసిపోగా 2024 అక్టోబర్ 13వ తేదీన నూతన అధ్యక్షుడు ఎన్నిక కూడా జరిగింది. అయితే నిర్మాణ కమిటీ లో ఉన్న కొందరు పెద్దలు భావన నిర్మాణానికి తమ వంతుగా కృషి చేశామని ఇందులో ఎక్కువ మొత్తంలో తాము డబ్బులు తీసుకువచ్చి పనులు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.
అయితే ఇందుకు సంబంధించిన డబ్బులు ఎవరిస్తారు అంటూ అప్పటి పదవి కాలం ముగిసిన అధ్యక్షుడిని నిలదీశారు. దీంతో పాత తేదీలలో కొంతమందిని జమ చేసి సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లుగా తప్పుడు తీర్మానాలు చేసి, తన పదవీకాలం ముగిసినప్పటికీ డిసెంబర్ 6వ తేదీన అధ్యక్షుడు హోదాలో వాసవి సదన్ ట్రస్ట్ గా మార్చి 12 మంది పేరిట రిజిస్ట్రేషన్ చేశారని సంఘ పెద్దలు ఆరోపిస్తున్నారు. పదవీకాలం ముగిసిన తర్వాత ఎలాంటి సమావేశాలు సంప్రదింపులు లేకుండా ఎలా ట్రస్ట్ గా మారుస్తారని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని వారు అంటున్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక పూర్తయిన తర్వాత మళ్లీ నిర్మాణ కమిటీ వేసి దానికి సంబంధించిన అభివృద్ధి పనులను చూడాల్సి ఉండగా వారిని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలతో సంఘం ఆస్తిని ట్రస్ట్ గా మార్చడాన్ని సంఘ జిల్లా నాయకత్వం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి చెందిన ఆస్తిని ఎలా ట్రస్ట్ గా మార్చారని దీనిపై పోలీసులను కూడా జిల్లా నాయకత్వం ద్వారా ఆశ్రయించినట్లు తెలిసింది.
అయితే చివరికి సంఘ పెద్దల మధ్యవర్తిత్వంతో జరిగిన సంప్రదింపులు అనంతరం దీనిని మళ్లీ యధావిధిగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి అప్పగించేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇక పట్టణ ఆర్యవైశ్య సంగం ఆస్తి వివాదం ప్రస్తుతం వేములవాడ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.