Nano urea | హుజూరాబాద్, ఆగస్టు 13: నానో యూరియాతో లాభాలు మెండుగా ఉంటాయని ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్ పేర్కొన్నారు. హుజరాబాద్ మండలం కనుకులగిద్దలో వెంకటరామిరెడ్డి పొలంలో ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్, హుజురాబాద్ ఏడీఏ సునీత, మండల వ్యవసాయ అధికారి భూమి రెడ్డి, జమ్మికుంట మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ ఇఫ్కో నానో యూరియా సందర్శన క్షేత్ర పరిశీలన బుధవారం చేశారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలనలో యూరియా బస్తాలు వాడిన పొలాలు, నానో యూరియా వాడిన పొలాల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించారు.
నానో యూరియా వాడిన పొలంకి యూరియా బస్తాలు వాడిన పొలం మధ్య వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నానో యూరియా బాటిల్ ఒక బస్తా యురియాతో సమానంగా పనిచేస్తుందని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా రైతులు అభిప్రాయాలను తెలుసుకొన్నారు. నానో యూరియా వాడడం వల్ల భూమి యొక్క సారాన్ని కాపాడడంతో పాటు పంట యొక్క నాణ్యత విషయంలో కూడా అభివృద్ధి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పీవో అధ్యక్షుడు పరమేశ్వర్, ఇఫ్కో జిల్లా అధికారి బాలాజీ, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సోదరులు పాల్గొన్నారు.